Oct 16,2022 00:34

వీసీ ప్రసాదరెడ్డిని సత్కరిస్తున్న దళిత సంఘాల ఆచార్యులు, స్కాలర్స్‌, విద్యార్థులు

ప్రజాశక్తి-విశాఖపట్నం : భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రా యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఏయు విసి ఆచార్య ప్రసాదరెడ్డి ప్రకటించారు. గురువారం సెనెట్‌ హాల్లో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏయూలోని వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌లో దళిత సంఘాల ఆచార్యులు, స్కాలర్స్‌, విద్యార్థులు వీసీకి శాలువా కప్పి, పూల బొకేలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 1973లో ఆంధ్రా యూనివర్సిటీ డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసిందన్నారు. హిందీ విభాగం భవనానికి ఏయూలో శంకుస్థాపన కూడా జగ్జీవన్‌రామ్‌ చేశారని గుర్తు చేశారు. భారత ఉప ప్రధాని గానూ, కేంద్రమంత్రిగా దాదాపు 50 సంవత్సరాల పాటు దేశానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. రక్షణ వ్యవసాయ, కార్మిక, రైల్వే మంత్రివర్యులుగా ఎన్నో విప్లవార్ధకమైన మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. నెహ్రు అధ్యక్షతన మొదటి క్యాబినెట్‌లో కూడా అతి చిన్న వయసుకుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించారన్నారు. అందుకే ఈయనను బేబీ మినిస్టర్‌ అని కూడా అంటారని తెలిపారు.
బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలపై మరింతగా అధ్యయనం, పరిశోధనలు జరగవలసిన ఆవశ్యకత ఉందని గుర్తించి ఈ అధ్యయన కేంద్రాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ జాగ్రఫీ విభాగం సీనియర్‌ ఆచార్యులు టి.వెంకటకృష్ణ, ఇంజినీరింగ్‌ కళాశాల చీఫ్‌ వార్డెన్‌ ఆచార్య వై.అబ్బులు, ఏయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఆచార్య యం.మధుసూదన్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మున్నంగి నాగరాజు, గెస్ట్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ చదువుల ఆశా కిరణ్‌, డాక్టర్‌ ముట్లూరి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.