
ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇండిస్టీ 4.0 కేంద్రం ఏర్పాటు కానుంది. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే సమ్రత్ ఉద్యోగ్ టెక్నాలజీ ఫోరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సదాశివ్ పాఢి, ఆపరేషన్స్ విభాగాధిపతి రాజేష్ పహాడిలు ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఏయూలో ఇండిస్టీ 4.0 కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతం, భవనాలు తదితర అంశాలను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా వీరు ఏయూలో ఇప్పటికే నిర్వహిస్తున్న పలు స్టార్టప్ సంస్థల పనితీరు పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు.
ఎయు వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డితో పాలక మండలి సమావేశ మందిరంలో ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. త్వరలో కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకొని ఎయులో సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎయు ఐపిఆర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతు పురుషోత్తం ఎయులో రూ.3 కోట్ల వ్యయంతో ఇండిస్టీ 4.0 ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తీర్చిదిద్ది అందించారు. కార్యక్రమంలో ఎయు రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఎయు ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఒ రవి ఈశ్వరపు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులను వర్సిటీ తరపున సత్కరించారు.