
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆరిట్ - 2023 జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. బీచ్ రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్లో రీసెంట్ ట్రెండ్స్ ఆన్ ఆప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోవ్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీస్ అంశంపై ఏయూ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం, నేషనల్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోవ్స్ అండ్ రేడియేషన్ ఇన్ ఇండిస్టీ (నారీ) సంయుక్తంగా నిర్వహించిన ఆరిట్-2023 జాతీయ సదస్సును నిర్వహించారు. ఎన్‌ఎస్‌టిఎల్ శాస్త్రవేత్త డాక్టర్ అబ్రహం వర్గీస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేడియేషన్ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకొని ఆవిష్కరణలు, నూతన పోకడలు దిశగా యువ శాస్త్రవేత్తలు కృషిచేయాలని సూచించారు. సర్ సివి.రామన్, ఆచార్య సిఆర్ రావు ఈ రంగంలో చేసిన పరిశోధనల గురించి వివరించారు. వారి స్ఫూర్తితో యువత మరిన్ని ఆవిష్కరణలు చేయాలన్నారు.
విసి ఆచార్య పివిజిడి.ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, రేడియేషన్ టెక్నాలజీ ద్వారా అద్భుతమైన సాంకేతిక ప్రగతి సాకారం అవుతుందన్నారు. ఈ దిశగా యువత, పరిశోధకులు ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించ నున్నట్లు చెప్పారు. స్టాన్ఫోర్డ్ సిలికాన్ వ్యాలీ మాదిరిగా ఇన్నోవేషన్స్, ఆవిష్కరణల దిశగా యువతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రేడియో ఐసోటోవ్స్, రేడియేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా యువ పరిశోధకుల అవిష్కరణలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా సదస్సు వివరాల సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిట్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ప్రదీప్ ముఖర్జీ, నారీ ప్రధాన కార్యదర్శి పీజే ఛాండీ, నదస్సు చైర్మన్ ఆచార్య ఎ.దుర్గాప్రసాదరావు, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాధిపతి ఆచార్య ఎవి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.