Oct 10,2022 23:29

ఉక్కు సిఎండి భట్‌ను సత్కరిస్తున్న ఎయు విసి ప్రసాదరెడ్డి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌
ప్రజాశక్తి,-ఎంవిపి కాలనీ
: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చెయిర్‌ ప్రొఫెసరును ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) సిఎండి అతుల్‌ భట్‌ ప్రకటించారు. సోమవారం ఎయు పాలక మండలి సమావేశ మందిరంలో విసి ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డితో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్టార్ట్‌ ఫ్యాక్టరీ, డిజిటలైజేషన్‌ దిశగా యువతను తీర్చిదిద్దాలని సూచించారు. ఆర్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఎయు ఏర్పాటుచేస్తున్న సెంటర్‌ ఫర్‌ మెడికల్‌ జెనిటిక్స్‌కు 'బయో ఆర్గాన్‌'గా పేరు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఎయు పూర్వవిద్యార్థులెందరో తమ సంస్థలో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తూ, సంస్థ ప్రగతికి దోహదపడుతున్నారన్నారు. ఎయుకు త్వరలో మరొక చెయిర్‌ ప్రొఫెసరు మంజూరు చేస్తామన్నారు. ఎయు విసి ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ద్వితీయ సెమిస్టర్‌ విద్యార్థులకు ఇండిస్టీ 4.0ను బోధనాంశంగా చేరుస్తామన్నారు. తద్వారా పరిశ్రమల అవసరాలు, మార్పులు, ప్రగతి, భవిష్యత్‌ విస్తృతిపై అవగాహన ఏర్పడుతుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ, వైవిధ్యమైన కేంద్రంగా ఆర్‌ఎఎన్‌ఎల్‌, ఎయు మెడికల్‌ జెనిటిక్స్‌ సెంటర్‌ నిలుస్తుందన్నారు. ఆర్‌ఎన్‌ఎల్‌ అందించిన చెయిర్‌ ప్రొఫెసర్‌తో ఇప్పటివరకు ఎయులో 10 చెయిర్లు ఏర్పాటయ్యాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కష్ణమోహన్‌, రెక్టార్‌ ఆచార్య కె.సమత, డీన్లు ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు, కె.బసవయ్య, ప్రిన్సిపల్‌ టి. శోభశ్రీ, ఇసి సభ్యులు క్రిష్ణమంజరి పవార్‌, జేమ్స్‌ స్టీఫెన్‌, ఒఆర్‌ఎం.రావు, స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎయు తరపున స్టీల్‌ సిఎండి అతుల్‌ భట్‌ను సత్కరించారు.