విశాఖ ఫార్మాసిటీతో ఆంధ్రా యూనివర్సిటీ ఎంఒయు
ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మారంగ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, ఔషధాల గుర్తింపు, తదితర రంగాలలో సేవలు అందించేందుకు వీలుగా ఆంధ్రా యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చి సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్‌తో ఎయు అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం ఎయు పాలక మండలి సమావేశ మందిరంలో వర్సిటీ విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి సమక్షంలో ఎయు రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, విశాఖ ఫార్మాసిటీ ఎండి డాక్టర్ పిపి లాల్‌కృష్ణ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి పరస్పరం మార్పుచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ఫార్మా దిగ్గజంతో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భంగా ఎయు రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్థులకు, సమాజానికి ఉపయుక్తంగా ఉండేందుకు సంయుక్త భాగస్వామ్యంతో అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చి సెంటర్ పనిచేస్తుందన్నారు.విశాఖ ఫార్మా సిటీ ఎండి డాక్టర్ పిపి.లాల్‌కృష్ణ మాట్లాడుతూ తక్కువ ధరకే ప్రజలకు ఔషధాలను అందించడమే లక్ష్యంగా ఔషధ అన్వేషణ, ఉత్పత్తిలో ఎంతో ప్రగతిని సాధించాల్సి ఉందని, ఆ దిశగా రాష్ట్రం గర్వించే విధంగా పనిచేస్తామన్నారు. ఎయు విసి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక ఎంఒయుతో సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు ద్వారా విశ్వవిద్యాలయానికి అంతర్గత నిధులను సమకూర్చుకోడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఫార్మశీతో పాటు పలు విభాగాల విద్యార్థులకు సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.రాజేంద్రప్రసాద్, ఆచార్య కెవి రమణమూర్తి, పాలకమండలి సభ్యులు ఆచార్య కృష్ణమంజని పవార్, రీసెర్చ్ డీన్ ఆచార్య కె.బసవయ్య పాల్గొన్నారు.










