ప్రజాశక్తి- విశాఖపట్నం భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సిఎస్‌సి అకాడమీ సౌజన్యంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మూడు నెలల కాలవ్యవధితో అందించే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎయు సెనేట్ మందిరంలో నూతన కోర్సుల ప్రారంభోత్సవంలో విసి మాట్లాడుతూ వ్యక్తుల సామర్ధ్యాలను మెరుగుపరచడం, మెరుగైన అవకాశాలను కల్పించడం కోసం నైపుణ్యాలను అందించే కోర్సులను, కార్యక్రమాలను ఎయు అందిస్తోందన్నారు. గ్రామీణ భారతావనిని ఆధారంగా చేసుకుని వ్యవసాయ ఆధారిత కోర్సులను రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు.
ఎయుతో భాగస్వామ్యానికి జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, తర్వాతో దీనికి సంబంధించి అవగాహన ఒప్పందాలు చేసుకుంటామన్నారు. ప్రపంచ ఉత్తమ వర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ఎయు ఎంఒయు చేసుకుంటోందన్నారు.
డిజిటల్ విధానంలో కోర్సుల ఆవశ్యకతను గుర్తించి, భవిష్యత్తులో ఎయు దూరవిద్య కేంద్రం పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో కోర్సులను అందించేలా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, సిఎస్‌సి అకడమిక్ హెడ్ వివేక్ కుమార్, టాలెంట్ ఎడ్జ్ సిఇఒ ఎండి నీలేష్, ప్రకాష్, డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎయు విసి ప్రసాదరెడ్డి










