Jul 11,2023 23:53

ఎయుతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్న నేవీ అధికారులు

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ, మధురవాడ : ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపయుక్తంగా ఇంటర్న్‌ షిప్‌ లను అందించేందుకు ఇండియన్‌ నేవీతో ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఏయూ పాలకమండలి సమావేశం మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎయు విసి ఆచార్య పివిజిడి.ప్రసాద్‌రెడ్డి సమక్షంలో నేవల్‌ డాక్‌యార్డు అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌ రియల్‌ అడ్మిరల్‌ సంజరు సాధు, ఎయు రిజిస్టార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ సంతకాలు చేశారు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇన్స్ట్రుమెంటేషన్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన, నైపుణ్యాలను పెంపొందించే దిశగా నేవల్‌ డాక్‌యార్డు ప్రత్యేకమైన ఇంటర్న్‌ షిప్‌ను అందించనుంది.
ఈ కార్యక్రమంలో ఎయు రెక్టర్‌ ఆచార్య కె.సమత, ప్రిన్సిపల్‌ ఆచార్య జి.శశిభూషణరావు, ఆచార్య ఎస్‌కె.బట్టి, అకాడమిక్‌ డీన్‌ ఆచార్య ఎన్‌ కిషోర్‌బాబు, అకాడమిక్‌ సెనేట్‌ సభ్యులు డాక్టర్‌ కుమార్‌రాజ, భారత నావికాదళానికి చెందిన సర్వీస్‌ అధికారులు అనూప్‌ మీనన్‌, ఆర్‌ వెంకటేశ్వరన్‌, కెప్టెన్‌ సుబ్రతో మండల్‌, గీతం ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, గీతం కార్యదర్శి ఎమ్‌.భరద్వాజ, డీన్‌ ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌, ఎస్‌.వంశీకృష్ణ, నేవల్‌ డాక్‌యార్డ్‌ అధికారులు, కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ అధికారులు పాల్గొన్నారు.