Nov 01,2023 21:16

మాట్లాడుతున్న జిఎంఆర్‌ సంస్థల చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు

భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రజాశక్తిలో నవంబర్‌ 1న విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజని ముందుగానే కథనం వచ్చిన మాదిరిగానే బుధవారం ఎల్‌ అండ్‌ టి సంస్థ భూమి పూజ చేసింది. దీనికి ముఖ్య అతిథిగా జిఎంఆర్‌ సంస్థల చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు హాజరయ్యారు. ఎల్‌ అండ్‌ టి సంస్థ నుంచి కూడా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కౌలువాడ రెవెన్యూ పరిధిలోని మరడపాలెం సమీపంలో ఈ భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ అనంతరం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన భూముల్లో చదును చేసే పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన యంత్రాలు కూడా ఎల్‌ అండ్‌ టి సంస్థ సిద్ధం చేసింది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి జిఎంఆర్‌ సంస్థకు ప్రభుత్వం సేకరించిన 2700 ఎకరాల్లో 2500 ఎకరాలను అప్పజెప్పింది. జిఎంఆర్‌ సంస్థ విమానాశ్రయం నిర్మాణ పనులను ఎల్‌ అండ్‌ టి సంస్థకు అప్పజెప్పింది. ఈ భూమి పూజలో రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు సిబ్బంది పాల్గొనేలా చర్యలు తీసుకుని ఇతర ప్రజా ప్రతినిధులెవరనీ పిలవకుండా భూమి పూజ చేసుకున్నారు.