ప్రఖ్యాత విమానయాన ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా టాటాల వశమైంది. కారు చౌకగా ధారాదత్తం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలోని మంత్రుల కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ డీల్ టాటాలకు దసరా బొనాంజా. అమ్మకపు విలువ రూ.18 వేల కోట్లు కాగా అందులో నగదు రూపంలో టాటాలు చెల్లించేది కేవలం రూ.2,700 కోట్లు. తతిమ్మా రూ.15,300 కోట్లూ ఎయిర్ ఇండియాకు ఉన్న రుణాల టేకోవర్. సదరు అప్పులను టాటా గ్రూపు ఎప్పటికి చెల్లిస్తుందో తెలీదు. కార్పొరేట్లు బ్యాంకుల్లో చేసిన రూ.లక్షల కోట్ల రుణాలను చేతికి ఎముక లేనట్లు రద్దు చేస్తోన్న మోడీ ప్రభుత్వ 'ఉదారత' అనుభవమే. ఆ పూర్వరంగంలో టాటాల రుణాలను రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ రీత్యా ఎయిర్ ఇండియా డీల్ టాటాలకు అంది వచ్చిన చౌక బేరం. రూ.లక్షల కోట్ల ప్రజా ధనం లూటీకి వాటంగా దొరికిన అవకాశం. ఎయిర్ ఇండియా అనేది చిన్న చితకా చిల్లర దుకాణం కాదు. టాటా ఎయిర్ సర్వీసెస్‌ను 1932లో జెఆర్‌డి టాటా స్థాపించగా తదుపరి టాటా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాగా పేరు మారింది. 1953లో భారత ప్రభుత్వం జాతి ప్రయోజనాల లక్ష్యంతో జాతీయీకరణ చేసింది. అప్పటి నుండి ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లను ఖర్చు చేసి అభివృద్ధి చేసింది. దేశ, విదేశాల్లో కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తులు, వందల విమానాలు, సుశిక్షితులైన సిబ్బంది ఈ 68 సంవత్సరాల ప్రస్థానంలో సమకూరారు. ప్రభుత్వ వనరులతో సృష్టించబడ్డ ఈ మొత్తం సంపద ప్రజలది. జాతి సొత్తును ఎలాంటి కష్టం లేకుండా సులభంగా టాటాలు ఎగరేసుకుపోయేలా మోడీ ప్రభుత్వం చేసిన ప్రైవేటీకరణ తంతు నిస్సందేహంగా జాతికి తలపెట్టిన ద్రోహం.
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కార్పొరేట్లకు లాభం, ప్రజలకు భారం అనడానికి తాజా ఉదాహరణ ఎయిర్ ఇండియా విక్రయం. సంస్థకు చెందిన 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాటులు, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలందించే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లోని వంద శాతం, ఐఎఎస్‌ఎటిఎస్‌లో 50 శాతం వాటాలు టాటాల హస్తగతమవుతాయి. సంస్థ అభివృద్ధికి రూ.61 వేల కోట్లు అప్పు చేయగా అందులో టాటాలకు బదిలీ అయ్యేది రూ.15,300 కోట్లు మాత్రమే. మిగతా రూ.46 వేల కోట్లు ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అంటే ఆ రుణాలన్నీ ప్రభుత్వానికి చెందుతాయి. అప్పులను వడ్డీలతో కలిపి సర్కారు చెల్లించాలి. దానర్ధం ప్రజలు ఆ భారం మోయాలి. టాటాలు మాత్రం ఎంచక్కా లాభాలు పిండుకుంటారు. బిజెపి డీ-మానిటైజేషన్ అన్నా, మోనిటైజేషన్ అయినా కార్పొరేట్ల దోపిడీకి ఊతం ఇచ్చేవే. అదానీ గ్రూపు ఎయిర్ పోర్టులను, పోర్టులను ఆక్రమిస్తుండగా, అంబానీ సహజ వాయువును, స్పెక్ట్రంను స్వంతం చేసుకుంటున్నారు. టాటాలు ఎయిర్‌లైన్స్‌పై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారని ఎయిర్ ఇండియా కొనుగోలు ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటాలకు వాటాలున్నాయి. ప్రభుత్వరంగంలోని ఎయిర్ ఇండియాను వశపర్చుకొని విమానయాన సర్వీసు కింగ్ అవతారం ఎత్తాలని చూస్తున్నారు. అందుకు మోడీ ప్రభుత్వం చేతనైనంత సహాయం అందిస్తోంది.
దేశంలో సరళీకరణ విధానాలొచ్చాక 1994లో ప్రైవేటు సంస్థలను అనుమతించాకనే ఎయిర్ ఇండియా ప్రభ కోల్పోయింది. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేయగా నష్టాలు మరింత పెరిగాయి. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకమే ఎజెండాగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వం 2017లో ఎయిర్ ఇండియాను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించి నిరుడు బిడ్లు ఆహ్వానించి వెనువెంటనే టాటాలకు ఖాయం చేసేసింది. ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడింది. కాగా ఈ డీల్‌ను కొత్త ఉషోదయమన్న విశ్లేషణ, పుట్టింటికి ఎయిర్ ఇండియా అనే సంబరపాటు, ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఒకప్పుడు ప్రైవేటు వారివేననే ముక్తాయింపులు యావత్తూ కార్పొరేట్ ప్రాయోజితాలు. ఎయిర్ ఇండియా ఉదంతం అంతం కాదు ఆరంభం మాత్రమే. మోడీ ప్రభుత్వం మరిన్ని సంస్థలను అమ్మకానికి అంగట్లో పెట్టింది. ప్రజల ఆస్తులను, సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రభుత్వ చర్యలను ఖండించాల్సిన, ప్రతిఘటించాల్సిన బాధ్యత దేశ పౌరులందరిదీ.










