ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి తన వంతు విరాళంగా ఒక నెల జీతం రూ.1.10 లక్షల చెక్కును డిఎల్‌ఒ డాక్టర్ పూర్ణేంద్రబాబుకు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున గురువారం అందజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులతో అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతో కలిసి కలెక్టర్ అల్పాహారం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిఎల్‌ఒ కన్వీనర్‌గా ఎయిడ్స్ వెల్పేర్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజలలో అవగాహన పెంచాలని, అసమానతలను అంతం చేయడానికి అందరూ ఏకమవ్వాలని, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎయిడ్స్ సోకిన వారిని అందరితో సమానంగా చూడాలని, కొత్తగా ఏ ఒక్కరూ కూడా హెచ్‌ఐవి భారిన పడకుండా అవగాహన కలిగించాలన్నారు. రక్తపరీక్షలు, రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్య సంచాలకులు డాక్టర్ ఎం.ఉమాసుందరి, జిల్లా ప్రోగామ్ అధికారులు డాక్టర్ ఎన్.జీవనరాణి, డాక్టర్ ఎం.రమారెడ్డి, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్చంద సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.










