Nov 16,2021 07:12

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఎయిడ్‌ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. కళాశాలలకు ఎయిడ్‌ రద్దు చేస్తూ జీ.వో.నెం.42, పాఠశాలలకు ఎయిడ్‌ రద్దు చేస్తూ జీ.వో.నెం. 50 జారీ చేశారు. ఈ విధంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలను అన్‌-ఎయిడెడ్‌గా మార్చడం రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలకు దారితీసింది. అనేక ప్రాంతాలలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి తమ విద్యా అవకాశాలను పరిరక్షించాలని ఆందోళన చేస్తున్నారు.
మహోన్నత చరిత్ర
రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఘనమైన చరిత్ర ఉన్నది. జాతీయోద్యమ కాలంలో, తరువాత దాతలు ఇచ్చిన స్థలాలలో ఈ సంస్థలు విద్యా సేవలు అందించటానికి ఏర్పడి ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా రూపుదిద్దుకున్నాయి. 1950 నుండి 1980 వరకు తొలి మూడు దశబ్దాలలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల వలన పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం ఏర్పడింది. విశాఖపట్నంలో మిసెస్‌ ఎ.వి.యన్‌ కళాశాల, విజయనగరంలో మహారాజా కళాశాల, భీమవరంలో డి.ఎన్‌.ఆర్‌ కళాశాల, ఏలూరులో సి.ఆర్‌.రెడ్డి కళాశాల, విజయవాడలో ఆంధ్రా లయోలా కళాశాల, సిద్ధార్థ కళాశాల, గుంటూరులో ఎ.సి. కళాశాల, హిందూ కళాశాల, కావలిలో జవహర్‌ భారతి వంటి కళాశాలలు ఉండబట్టి ఆయా ప్రాంతాలలో విద్యార్థులకు ఉన్నత విద్య అందింది. నోబెల్‌ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం, కె. రోశయ్యి, ఎన్‌.టి. రామారావు, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, జె.డి. శీలం, బొత్స సత్యనారాయణ, బి.వి. రాఘవులు వంటి ప్రముఖలంతా ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుకున్నవారే. మచిలీపట్నం, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, నర్సరావుపేట మొదలగు చోట్ల ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలలో స్థిరపడ్డారు.
ప్రభుత్వాల విధానాలు - భర్తీ నిషేధం
ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో పోస్టులు ఖాళీగా వున్నాయని విద్యా ప్రమాణాలు సరిగా లేవని ఇప్పుడు ప్రభుత్వం, అధికారులు వాదిస్తున్నారు. దీనికి కారణం ఉమ్మడి రాష్ట్రం లోను, ఇప్పటి రాష్ట్రం లోను ఏ పార్టీ అధికారంలో వన్నప్పటికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే కారణం. విద్యా రంగ ప్రైవేటీకరణలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ విధానాల అమలులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1999లో డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీ చేయరాదని మెమో ఇచ్చింది. డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2006లో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో, జూనియర్‌ కళాశాలల్లో పోస్టుల భర్తీ నిషేధిస్తూ జీవో నెం.35 జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టుల భర్తీని నిషేధించింది. అప్పటి నుండి ఉద్యోగ విరమణ చేసిన, ఖాళీ అయిన అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాలేదు. పోస్టులు భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు అనేక ఆందోళనలు చేశాయి. ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పటి (2007) నుంచి ఇప్పటి వరకు వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులకు ... జీవో నెం.35 రద్దు చేయాలని, ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పరిరక్షించాలని శాసన మండలిలో, వెలుపల కూడా పి.డి.ఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆందోళన చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. పోస్టులు భర్తీ చేయకపోవటం వలన యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అన్‌-ఎయిడెడ్‌ అధ్యాపకులకు యాజమాన్యాలే జీతాలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఎయిడెడ్‌ సంస్థలలో పని చేసే అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వ సంస్థలలో పని చేసే వారితో సమానంగా సౌకర్యాలు అందలేదు. మెడికల్‌-రీఎంబర్స్‌మెంట్‌, ఎ.పి.జి.ఎల్‌.ఐ, ప్రమోషన్లు, సకాలంలో జీతాలు పొందటం మొదలగు అన్ని విషయాలలో ఎయిడెడ్‌ సిబ్బందికి అన్యాయం జరిగింది. ఇప్పటికీ మెడికల్‌-రీఎంబర్స్‌మెంట్‌ గాని, హెల్త్‌కార్డులు గాని లేవు. కొన్ని ఎయిడెడ్‌ యాజమాన్యాలు కూడా సిబ్బంది పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరించాయి.
ఎయిడెడ్‌ విద్యాసంస్థలు - ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 124 కళాశాలల యాజమాన్యాలు అన్‌ ఎయిడెడ్‌గా మారటానికి సమ్మతి ఇవ్వగా, 7 యాజమాన్యాలు ఆస్తులతో సహా స్వాధీనానికి అంగీకరించాయి. 137 డిగ్రీ కళాశాలల్లో లక్షా పద్నాలుగు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 122 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 107 యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మతి తెలిపాయి. వీటిలో 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు గాని, ఉన్నత పాఠశాలలుగాని 1,988 ఉండగా వాటిలో 1,214 పాఠశాలల యాజమాన్యాలు సమ్మతి తెలిపాయి. కొన్ని యాజమాన్యాలు హైకోర్టులో కేసులు వేయగా బలవంతంగా విలీనం చేయవద్దని, ఎయిడ్‌ రద్దు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సమ్మతించిన కొన్ని పాఠశాలలు, కళాశాలలు కూడా విలీనం రద్దు చేసుకుని, ఎయిడెడ్‌గా కొనసాగటానికి ప్రయత్నిస్తున్నాయి.
విద్యార్థుల ప్రయోజనాలు - ఆందోళనలు
రాష్ట్రంలో ఇప్పటికి ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 లక్షలు, డిగ్రీ కళాశాలల్లో లక్షా పద్నాలుగు వేలు, జూనియర్‌ కళాశాలల్లో 60 వేల మంది మొత్తం 3,74,000 మంది విద్యార్థులు ఉన్నారు. తమ ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కొనసాగాలని కోరుతూ విశాఖపట్నం, కాకినాడ, నందిగామ, అనంతపురం, విజయవాడ మొదలగు అనేక చోట్ల వేలాదిమంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎయిడెడ్‌ విద్యా సంస్థలను అన్‌-ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా మార్చటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉదా: విజయవాడ నగరంలో 7 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు ఉంటే ఒక్కటే ప్రభుత్వ కళాశాల ఉన్నది. మచిలీపట్నం, గుడివాడ, నర్సరావుపేట, నందిగామ, తెనాలి మొదలగు పట్టణాలలో ఎయిడెడ్‌ కళాశాలలు తప్పితే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఇంతవరకు ఏర్పడలేదు. గుంటూరు జిల్లాలో 7 మండల కేంద్రాలలో (ఒక్కో మండల కేంద్ర జనాభా 25 వేలకు పైగా) ఎయిడెడ్‌ పాఠశాలలు తప్పితే, జిల్లా పరిషత్‌ పాఠశాలలు లేవు.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఎయిడెడ్‌ సంస్థలను కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. అన్‌ ఎయిడెడ్‌గా మారినప్పటికి ఫీజు - రీయంబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కాని విద్యార్థులు విశ్వసించడం లేదు. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ఉన్న అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఎన్‌.సి.సి, ఎన్‌.ఎస్‌.ఎస్‌ వంటి సదుపాయాలు అన్‌-ఎయిడెడ్‌ లేక ప్రైవేటు కళాశాలల్లో వుండవని విద్యార్థులు భావిస్తున్నారు.అందువలన రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, ఎమ్మెల్సీలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా చర్చలు జరపాలి. 'ప్రతిపక్షాల కుట్ర' అనే పేరుతో ఆలోచించకుండా, 3,60,000 విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రుల ఆందోళనను అర్ధం చేసుకోవాలి.
అన్‌-ఎయిడెడ్‌ అధ్యాపకులు
ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో జీ.వో.నెం.35 పోస్టుల భర్తీ నిలిపివేయడంతో...గత 15 ఏళ్లుగా డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో ఎయిడెడ్‌ పోస్టులలో సుమారు 3 వేల మంది అన్‌ ఎయిడెడ్‌ అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వీరు కేవలం రూ.10 వేల జీతంతో పని చేస్తూ 'ఎప్పటికైనా పర్మనెంట్‌ అవుతాం లేదా టైమ్‌ స్కేల్‌ పొందుతాం' అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు అన్‌-ఎయిడెడ్‌గా మారటంతో అన్‌ ఎయిడెడ్‌ అధ్యాపకులు మొత్తం రోడ్డున పడ్డారు. అన్‌-ఎయిడెడ్‌ అధ్యాపకులది మాకు సంబంధం లేని అంశం అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అన్‌-ఎయిడెడ్‌ అధ్యాపకులకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో చదవుతున్న విద్యార్థులు ఒక్కరు కూడా నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు చేయకుండా, చర్చల ద్వారా విద్యార్థుల ప్రయోజనాలు పరిరక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలి.
                    ఎయిడెడ్‌ సంస్థలలో విద్యార్థుల సంగతేమిటి?       / వ్యాసకర్త : శాసనమండలి సభ్యులు,  సెల్‌ : 94402 62072 /