ప్రజాశక్తి - ఆదోని
నాడు ఉన్న ఎయిడెడ్ హైస్కూళ్లు నేడు మాయమయ్యాయని, దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ, సీనియర్ నాయకులు మదిరే భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సాంబకల్ ఫక్రుద్దీన్, బసాపురం రామస్వామి, గుడిసె శ్రీరాములు, వడ్డేమాన్ గోపాల్, సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం టిడిపి నాయకులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదోని మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులకుగాను ప్రభుత్వ హైస్కూళ్లలో ఎల్లే మల్లేశప్ప కన్నడ హైస్కూల్ మూసివేత దిశగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు. ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 2 లక్షల కుటుంబాలకు గాను 3 హైస్కూళ్లు మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. వైసిపి అధికారంలో వచ్చాక ఎయిడెడ్ స్కూళ్లలో 8 స్కూళ్లు బంద్ కావడంతో పట్టణంలో చదువుకునే పిల్లలకు సీట్లు దొరకక తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. పట్టణంలో ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు మసూదియా హైస్కూల్, ఉర్దూ అంబర్‌పేట్ బాలిబాలికల హైస్కూల్ మాత్రమే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఒసి విద్యార్థులకు మున్సిపల్ హైస్కూల్, నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ ఉన్నాయని, ఎటు చూసినా 5 కిలోమీటర్ల దూరం ఉందని తెలిపారు. పట్టణంలో వీర సేవ కన్నడ స్కూల్, ఆలగంగమ్మ స్కూల్, మిఠాయి చెన్న బసప్ప స్కూల్, పొట్టిశ్రీరాములు స్కూల్, రాయ మిల్స్ హైస్కూల్, టిజిఎల్ హైస్కూల్, జీవేశ్వర హైస్కూల్, వైఎన్‌కె హై స్కూల్ మూతపడ్డాయన్నారు. మాజీ సర్పంచి కారుమంచప్ప, నారాయణపురం షేక్షావలీ, వాల్మీకి రాముడు, శివయ్య స్వామి, సాధిక్ వలీ పాల్గొన్నారు.
ఆర్‌డిఒ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన టిడిపి నాయకులు










