మొన్న అనంతపురంలో, నిన్న కాకినాడలో ఎయిడెడ్ విద్యార్థులపై ఖాకీలు ప్రదర్శించిన కర్కశత్వం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. తమ భవిష్యత్తు ఏం కానుందోనన్న భయాందోళనలతో విద్యార్థులుంటే, ఏమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించాలా? స్వయంగానే నడుపుకోవాలా? లేదా మూసేసుకోవాలా? అనేది యాజమాన్యాల ఇష్టమని, ఇందులో బలవంతమేమీ లేదని కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించడం విద్యా వ్యవస్థను మోసగించడమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించిన అసలు సమస్యలను పాలకులు కావాలనే కప్పిపెడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇదేమీ యాజమాన్యాలకు, ఎయిడెడ్ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, వేలాది మంది అన్ ఎయిడెడ్ ఉద్యోగులు, ఇతర సిబ్బంది జీవితాలతో ముడిపడిన అంశం. ఈ వాస్తవాన్ని దాచి కొన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేవని, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనీ, బోధనా సిబ్బంది నియామకాలు లేవన్న సాకులతో మొత్తం ఎయిడెడ్ విద్యా వ్యవస్థకే సమాధి కట్టడం దుర్మార్గం. ఎయిడెడ్ నియామకాలను కుదిస్తూ వచ్చిందంటూ గత ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే ఇప్పుడు మొత్తానికే నిధులు నిలిపేస్తామనడం బెదిరింపు కాకపోతే మరేంటి? ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పాలిట ఇది యమపాశం కాదా?
దేశంలో ప్రజలందరూ చదువుకొన్నప్పుడే పురోగతి సాధ్యం అన్న బలమైన అభిప్రాయానికి బీజాలు జాతీయోద్యమానికి పూర్వమే పడ్డాయి. ఆ క్రమంలోనే దేశంలో విద్యాలయాల స్థాపన ఒక ఉద్యమంగా సాగింది. జ్యోతిబా ఫూలే వంటి వారి కృషి చిరస్మరణీయం. రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తలు, క్రైస్తవ మిషనరీలు, టిటిడి వంటి ధార్మిక సంస్థలు, విజయనగరం, బొబ్బిలి లాంటి చోట్ల దాతృత్వ స్వభావం కలిగిన రాజులు, భూస్వాములు, స్వచ్ఛంద సంస్థలు సేవాతత్పరతతో విద్యాలయాలు నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు ఈ సంస్థలను ఆర్థికంగా ఆదుకోవడం తమ బాధ్యతగా స్వీకరించాయి.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఈ విద్యాలయాలకు అనుబంధంగా గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలను, పుస్తకాలను, విద్యావసర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చింది. ఇప్పుడు యాజమాన్యాల ఇష్టానికి వదిలేస్తే ప్రజల ధనంతో పోగైన ఈ సంపదకు జవాబుదారీ ఎవరు? ప్రభుత్వానికి కనీసం ఈ మాత్రం సోయి వుండాలి కదా. అమ్మ ఒడి, విద్యా కానుక వంటివి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా బడిని మాకు లేకుండా చేయవద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ ఆందోళనల్లో పాల్గొన్న చిన్నారులు విన్నవిస్తున్న తీరు చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం సిగ్గుచేటు.
నూతన ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్న 1990 తర్వాత విద్యా వ్యవస్థ ప్రయివేటీకరణ కూడా జోరందుకుంది. విద్యాబోధనను సామాజిక బాధ్యత కాకుండా వ్యాపార సరుకుగా మార్చేశారు. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వం లోని టిడిపి ప్రభుత్వం ఎయిడెడ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రభుత్వ సాయాన్ని అంతకంతకూ కుదించుకుంటూ వచ్చింది. ఈ చర్యలను నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాని ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విధానాలనే అనుసరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రయివేటు విద్యాసంస్థలకు ముట్టజెప్తూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ ఇటు ప్రభుత్వ రంగాన్ని, అటు ఎయిడెడ్ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే గతంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు చంద్రబాబు సాయాన్ని కుదిస్తే రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. ఆ తర్వాత తానూ ఎయిడెడ్ వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ చంద్రబాబు విధానాన్నే కొనసాగిస్తూ మరో అడుగు ముందుకేస్తే దానిని చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యతిరేకిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను గత టిడిపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ఇప్పటి వైసిపి ప్రభుత్వం పూర్తిగా సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికైనా ఈ నాటకాలకు తెరదింపి ఎయిడెడ్ విద్యాసంస్థలకు సాయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. లేదా ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకొని నాటి దాతృత్వ మహనీయులు ఆశయాలకు కట్టుబడి విద్యా సంస్థలను కొనసాగించాలి. ఒకవేళ స్వాధీనం చేసుకున్నా ఎయిడెడ్ విద్యాలయాల ఆస్తులను ప్రజావసరాల పేరుతో తిరిగి ప్రయివేటుకు కట్టబెట్టకుండా కచ్చితంగా విద్యా ప్రయోజనాలకే వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాని విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థుల భవిష్యత్‌ను, అన్ ఎయిడెడ్ సిబ్బంది జీవితాలను నాశనం చేయరాదు.










