
ప్రజాశక్తి-గుంటూరు : ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం గుంటూరు జిల్లా, రాష్ట్ర మహాసభలు ఆదివారం స్థానిక గొట్టిపాటి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాసిజం-రాజకీయ, ఆర్థిక, సాంస్కృతి అంశాలు అనే అంశంపై జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రమేష్ పట్నాయక్ ప్రసంగించారు. ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిరెడ్డి హనుమంతరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా విప్లవం రాదని, కానీ ఫాసిజం వస్తుందన్నారు. విప్లవాన్ని అణచివేసే ముందస్తు చర్య ఫాసిజమని వివరించారు. పెట్టుబడిదారీ పాలనలో సంక్షేమ పథకాలతోనూ విప్లవాలకు అడ్డుకట్ట వేస్తారన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ధర్మాల రూపంలోని చట్టాలు ఫాసిజాన్ని అమలు చేసే చర్యలు, నియంతృత్వం, మతోన్మాదం కలిసిన పాలనే ఫాసిజం అన్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఫాసిజం కొనసాగింపు తప్పదని అన్నారు. హనుమంతరెడ్డి మాట్లాడుతూ అప్రకటిత అత్యవసర పరిస్థితి లాగా భారత్ అప్రకటిత హిందూదేశం అయ్యిందన్నారు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, విద్యా, వైద్యం, సాహిత్యం, సాంస్కృతిక, పరిశోధనా సంస్థలు అన్నీ సంఫ్‌ు పరివారం అధికారుల ఆధీనంలో ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చదని, ఇండియా లాంటి పదాలను తొలగించటం, లౌకిక సామ్యవాద పదాలను తొలగించి, హిందూమతం, వైదిక శాస్త్రం లాంటి పదాలను రాజ్యాంగంలో చేరుస్తుందని చెప్పారు. రాజ్యాంగ లొసుగుల్ని వాడుకుంటుందన్నారు. అనంతరం వల్లూరు తాండవ కృష్ణ, పివి.మల్లిఖార్జునరావును ప్రోగ్రెసివ్ ఫోరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.