Aug 20,2023 23:31

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ (పౌడ)కు ఇంత వరకు సౌకర్యాలేమీ ఏర్పాటు కాలేదు. ఈ సంస్థ ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబరు 13న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జనవరిలో పౌడ చైర్మన్‌గా నర్సరావుపేటకు చెందిన మిట్టపల్లి రమేష్‌బాబును నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకు సంస్థ వైస్‌ చైర్మన్‌గా జి.శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరెడ్డి పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేస్తూ పల్నాడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల సిఫార్సుతో డిప్యూటేషన్‌పై వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.
పల్నాడు జిల్లా మొత్తాన్ని ఒకే పట్టణాభివృద్ధి సంస్థగా ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబరులో ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి తగిన విధివిధానాలు జారీ, మౌలికసదుపాయల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రజలకు కల్పించాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపులేదు. పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ (పౌడ) కార్యాలయానికి భవనం లేదు. దీంతోఒక ప్రైవేటు భవనంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. జి.శ్రీనివాసరెడ్డిని వైస్‌ చైర్మన్‌గా నియమించినా మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాను కల్పించలేదు. మరోవైపు 'పౌడ'కు సిబ్బందిని కేటాయించకపోవడంతో పలు మున్సిపాల్టీల నుండి కొంతమంది సిబ్బందిని డిప్యూటేషన్‌పై కేటాయించారు.
ప్రస్తుతం 'పౌడ' పరిధిలోకి వచ్చే గ్రామాల్లోని భూములు, వెంచర్లు, అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. నిర్మాణాలకు, వెంచర్లకు 'పౌడ' అనుమతి తీసుకోవాలని వైస్‌చైర్మన్‌ హోదాలో శ్రీనివాసరెడ్డి నోటీసులు జారీ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అనధికారిక వెంచర్లు జోరుగా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములు మారుస్తున్నారు. ఇందుకు సంబంధించి పౌడ నుంచి అనుమతి తీసుకోవడం లేదు. ఈ సంస్థకు సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల వెంచర్లలో నిబంధనల అమలుకు సాధ్యం కావడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా వెంచర్లు వేస్తున్నా రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వెంచర్లకు అనుమతి ఇవ్వాల్సిన పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పౌడ) నిర్వహణకు ఇంకా నిర్ధిష్టంగా ఆదేశాలు రాకపోవడం వల్ల ఎవ్వరూ నియంత్రించడం లేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కాల్వ గట్లను సైతం ఆక్రమించి రోడ్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రియల్టర్లు కనీస నిబంధనలు పాటించడం లేదని, రాజకీయ పలుకుబడితో వ్యవసాయ భూముల్లో ప్లాట్‌ వేసి విక్రయాలు చేస్తున్నట్టు తెలిసింది.
భూ మార్పిడికి పంచాయతీ, మున్సిపాల్టీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మొత్తం భూమి విలువలో ఐదు శాతం ఫీజును స్థానిక సంస్థలకు చెల్లించాలి. మొత్తం భూమిలో 10 శాతం కమ్యూనిటీ స్థలాలుగా వదిలిపెట్టాలి. ఇందుకు సంబంధించి పౌడకు ఉన్న అధికారాలు, నియంత్రణ, నిబంధనలు పాటించే అంశాలపై ప్రభుత్వం ఇంత వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మున్సిపల్‌ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు కూడా ఎనిమిది నెలలుగా ఒక్కసారిగా పౌడ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలులేవు. కేవలం రాజకీయ ఉపాధి కోసం వైసిపి నాయకులు మిట్టపల్లి రమేష్‌బాబుకు చైర్మన్‌ హోదా ఇచ్చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేయించారు. మాతృశాఖలో పనిచేయడం ఇష్టం లేక డిప్యూటేషన్‌పై వైస్‌ చైర్మన్‌ హోదాను తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి కోసం ఈ సంస్థ ఏర్పాటు అయినట్టు ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఈ సంస్థ ద్వారా పల్నాడులో ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు అంటూ ఏమీ లేవు. పౌడాపరిధిలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలపై ఎవరికీ పట్టడం లేదు.