ఊహల స్వప్నాలతో ఊరేగుతూ..
ఉవ్విళ్ళూరిస్తూ మనుషులను
ఉరకలు పెడుతు నిద్రపోనివ్వదు
అంతుచిక్కని ఆరాటాల ఆర్భాటాలు
నగరం ఎడారిలో పయనం
ఉరుకుల పరుగుల జీవితాలు
చేతికందని సంతోషాలు
ముఖానికి ప్లాస్టిక్ ముసుగులు
కపట ప్రేమలు, ముసలి కన్నీళ్లు
ఎదురుచూపుల ఎంగిలి జీవితాలు
ఎవరికి వారే యమునా తీరే
అవసరాలను తీర్చుకునేందుకు
అమ్ముడుపోయే అంగడి సరుకై
కళ్ళముందు చేతులు మారతాయి
పల్లెలాగా కమ్మటి మట్టి వాసనలకు
బదులు నిత్యం మురుగు కాలువలు
ఇంటి ముంగిటనే దర్శనమిస్తాయి
మసకబారి పొగ మబ్బులు
విష కాలుష్యపు దుర్గంధాలే..!
మనుషులను తికమక పెట్టి
చెమట చుక్కలను మైమరిపించే
అత్తర్లతో ఆదమరిచిపోవాలి
బతుకు భారాలు, ఆశ దూరాలు
కులమత ప్రాంతాలకతీతంగా
అందరినీ ఒకే వేదికపై కలుపుకుపోతున్నా
నగర జీవనం ఎన్ని ప్రలోభాలకు లోనైనా
మేడిపండు చందమై మెరుస్తాయి
ఆకాశాన్ని అంటుతున్న భవంతులు
నేలపై నిలువ నీడలేని పూరి గుడిసెలు
నాణానికి రెండువైపుల బొమ్మ బొరుసులా
విలాసవంతమైన ఇంద్ర భోగాలు
నిలువ నీడలేని భారమైన బతుకులు
జీవిత వీధిభాగోతాల దృశ్యాలు ఎన్నెన్నో..!
తీరిక దొరకదు? ఆశ చావదు?
యాంత్రిక సంసార జీవితపు ఆటుపోట్లు
నగరం ఒక పద్మవ్యూహం తరిక
మనుషుల గమ్యం ఎటువైపో..?
గడియారం ముల్లుతో పరిగెడుతుంది
కష్టాల బతుకు బండిని లాగుతూ
బరువెక్కిన హృదయం నిండా
రోడ్లపై గాయపడిన గుర్తులెన్నో
ఆకాశహర్మ్యాల సుడిలో చిక్కి
బతుకు భారమైన వలసలు
నగరం నడివీపు మీద రాచపుండై
సలుపుతుంది పేదరికం
పూటగడవక కష్టాలతో కడలి కెరటాలపై
సంసార జీవితాలు ఈదుతారు
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు
విష సంస్కృతికి దాసోహం
ఎడారి దిబ్బల్లో వెతుకులాటలే
అభిమానాలు మానవత్వము
సమసిపోయి
ప్రశ్నించే గొంతుకలకు
పచ్చనోట్లను ఎరవేసి శాసిస్తుంది.
ఇక్కడ సూర్యాస్తమయాలు ఒకలాగే
ఎల్‌ఈడీ లైట్లుతో రంగుల ప్రపంచాన్ని
ఈదుతూ సముద్రతీరంలో దొరికిన
ముత్యాల వెలుగులను విరజిమ్ముతాయి
అలసిన కన్నుల్లో స్వప్నాల చంద్రికలెన్నో
ముఖంపై కప్పుకున్న దుప్పటి సగం నిద్రలో
ముసుగు తీసి.. తొంగి చూస్తుంది నగరం
అడుగడుగున నవరసాల సినిమాలు
కళ్ళముందు కదులుతూ కనిపిస్తాయి
నగరం నిద్రపోదు..
మనుషులను నిద్రపోనివ్వదు..!
రంగుల హంగులను పులుముకుని
నిరంతరం కాలచక్రంతో పరిగెడుతుంది!
కొలిపాక శ్రీనివాస్
98665 14972