Aug 22,2021 06:36

    రోజు రాఖీ పర్వదినం. తోబుట్టువులు కట్టిన రంగురంగుల రాఖీలతో చాలామంది సోదరుల ముంజేతులు కొత్త కాంతులు విరజిమ్మే రోజు. ఆడపిల్లలకు అన్నదమ్ములు ఎల్లప్పుడూ రక్షగా నిలవాలని చాటిచెప్పే గొప్ప సంస్కృతిగా కథోపకథలు వర్థిల్లుతున్న రోజు. అనుబంధాలూ, భావోద్వేగాలూ కలగలిపి చాలా అందంగా, ఆహ్లాదంగా అనిపించే రోజు. ఇలాంటి చాలా సందర్భాల్లో సెంటిమెంటు లేపనం కింద చర్చించాల్సిన అసలు వాస్తవాలు మరుగున పడిపోతాయి. ఇన్నిన్ని అనుబంధాల పాటలూ, రాఖీ ఉత్సవాలూ వెల్లువెత్తుతున్న చోట తరచూ ఎందుకని ఆడపిల్లలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి? అమ్మాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఉగ్ర ప్రేమలూ, ఉన్మాద ప్రేమలూ ఎందుకని నిరంకుశంగా బలిగొంటున్నాయి? చుట్టూ ఇంతింత సోదర సోదరీ వాత్సల్యం పొంగిపొర్లుతున్న చోట ఎందుకని 'రక్షణ' కరువవుతోంది? అసలు ఎవరు ఎవరికి రక్షణ ఇస్తారు? ఒకరి నుంచి మరొకరు రక్షణ పొందే స్థితిలో ఉన్నారంటే అర్థం - ఆ రక్షణ పొందే వ్యక్తి రక్షణ ఇచ్చే వ్యక్తి లేదా వ్యక్తుల కన్నా బలహీనం అని. అందుకనే కాబోలు; మన సూర్యరాయాంధ్ర నిఘంటువు స్త్రీకి దాదాపు 130 పర్యాయ పదాలను ఉటంకిస్తూ ... అబల, అతివ, మృగనయన వంటి ఆధారపడే, బెదిరిపోయే, రూపు రేఖా లావణ్యాలకే పరిమితం చేసే పద సముదాయంతో పట్టం కట్టింది. మహిళను తనదైన సొంత వ్యక్తిత్వంతో చూడలేని మనువాద సంస్కృతికి ఈ మాటల మూట ఒక ఆనవాలు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు స్త్రీకి రక్షణ కల్పిస్తారని ఘనంగా చెప్పుకున్న వెనకబాటు భావజాలానికి ఈ పర్వదినం ఒక ప్రతీక.
      'స్త్రీలు పుట్టరు; తయారు చేయబడతారు' అని ఒక నానుడి ఉంది. అది అక్షరాలా నిజం. పదీ పదకొండేళ్ల దాకా దాదాపు ఏ ఇంటనైనా ఆడ, మగ పిల్లలు ఒకే విధంగా ఎదుగుతారు. ఆ తరువాత ఇంటి చేత, సమాజం చేతా ఆడపిల్లలు వేరే విధంగా తయారు చేయబడతారు. ఎలా కూచోవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి వంటి సవాలక్ష సలహాలూ, ఆంక్షలూ వారిపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంటాయి. ఈ అనధికార తర్ఫీదు ఆడపిల్లలను అబలలుగా, భయపడేవారిగా; మగపిల్లలను ఆధిక్యులుగా తయారు చేస్తుంది. కనీసం అలా అనుకునేలా వాతావరణం తయారవుతుంది. ఇతరత్రా సామాజిక ఏర్పాట్లు, వెసులుబాట్లూ ఈ సూత్రానికి అనుగుణంగా రూపొందుతాయి. చరిత్రలోనూ, వర్తమానంలోనూ చాలామంది వీరనారుల కథలూ, గాధలూ మనం వింటూ ఉంటాం. చెబుతూ ఉంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి, కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌, కల్పనా చావ్లా, మీరా చాను ... తదితరులంతా ఇలాంటి ఆంక్షల కంచెలను అధిగమించి అద్భుత విజయాలను సాధించినవాళ్లే! సంస్కృతీ సాంప్రదాయాల పేరిట నాటే ఆంక్షల కంచెల మధ్య చిక్కుకుపోయి ఉంటే- వారిన్ని అద్భుతాలను సాధించి ఉండేవారు కాదు.
   అసలు అమ్మాయిలను అబ్బాయిలు రక్షిస్తారు, ఉద్ధరిస్తారు అన్న ఆలోచనా ధోరణే ఒక పురుషాధిపత్య భావజాలానికి సూచిక. ప్రకృతి కోణంలోంచి పరిశీలిస్తే-స్త్రీలు అబలలు కారు; అనేక కారణాలూ, అనుభవాల చేత బలాఢ్యులు కూడా! వేయి వేయిల రెట్టింపు నొప్పిని పంటి బిగువన భరిస్తూ బిడ్డను ప్రసవించి, పాలిచ్చి, పెంచి, పోషించిన తల్లులు; అనేకనేక సాధక బాధకాల మధ్య ఇంటిని సజావుగా నిర్వహించే అమ్మలు .. ఏవిధంగా అబలలు అవుతారు? నిజానికి మహిళలకు ఆపాదిస్తున్న అబలత్వం సమాజపు అసమానత్వ దృష్టిలో ఉంది. భాషలో, భావనలో, భద్రత ఇవ్వడంలో పురుషాధిక్య భావజాలం నిర్మించిన కపటత్వంలో ఉంది. అలాంటి వివక్షాపూరిత భావజాలాన్ని తుత్తనియలు చేయటమే ఇప్పుడు అత్యంత అవసరం. ఒకడు భయపెట్టేవాడు, ఒకరు భయపడేవారు; ఒకరు భోజ్య వస్తువూ, మరొకడు అనుభవించేవాడు ... అన్న మైండ్‌సెట్టు ఉన్నంతకాలం ఎన్ని రాఖీ పండగలు జరుపుకున్నా- మహిళలకు రక్షణ దొరకదు. అందమైన పైపై పూతలు గల ఆధిపత్య భావజాలాన్ని స్త్రీల చేత అంగీకరింపచేసి, ఆచరింపజేసే తతంగమే ఇదంతా. స్త్రీ అయినా, పురుషుడైనా ఈ ప్రకృతిలో భాగం, సరి సమానం. సమాజ పురోభివృద్ధికి ఈ ఇద్దరూ అత్యంత అవసరం. ప్రతి మహిళనూ పరిపూర్ణపు వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తిస్తే, గౌరవిస్తే; ఆడబిడ్డ మార్కెట్టు సరుకు కాదని సమాజం భావిస్తే, పాటిస్తే ... ఇక ఈ సెంటిమెంటు రక్షలతో పని ఉండదు. అలాంటి చైతన్యం, సదవగాహన గల సమాజమే మనకు కావాలి! దాని నిర్మాణంలో అందరం భాగస్వాములం అవ్వాలి !