అది కాళ్ళకింద నేలను
ఎత్తుకుపోతోంది
పండించిన పంటను
తన్నుకుపోతోంది
ఇప్పుడు ఉక్కు వృక్షాన్నే
గుప్పెట్లో పెట్టుకుంటోంది
ప్రతిదాన్నీ రాజ్యం
పరాయి చేతుల్లోకి ధారబోసాక
ఇక ఏదీ
మనదనే మాటే ఉండదు
మన చెమట చుక్కలుపోసి
పెంచుకున్న మొక్కైనా
మన రక్తమాంసాలు పెట్టి
మొలకెత్తించిన మడిచెక్కైనా
మనది కాదు
మనకంటూ ఏదీ మిగలదు
ప్రైవేట్ గాలి ఉధృతంగా వీస్తూ
సమస్తాన్నీ ఎగరేసుకుపోతోంది
రహస్య కుట్రేదో చాపకింద నీరులా విస్తరిస్తోంది
మన కష్టంమీద
మనకు కదా హక్కుండాలి
మన శ్రమమీద
మన సంతకముండాలి కదా
ఇది ఇలా కొనసాగితే
దేని మీదా మన పేరుండదు
మన ఉనికే ఇకపై గల్లంతవుతుంది
ఉక్కునగరమిపుడు
దు:ఖంతో వెక్కిళ్ళు పెడుతోంది
పెంచి పోషించిన ఉక్కు ఊపిరులు
పరాయి గుప్పెట్లోకి పోతుంటే
శ్రామికుల గుండెల్లో
గరం గరంగా అగ్గి రాజుకుంటోంది
ఇక ఆలస్యం చేయకూడదు
నెత్తుటి బొట్లు చిందించి
పెంచి పెద్దజేసిన
మనదైన వాటిని
మనమే కాపాడుకుందాం
గరుకు చేతులను రాపాడుతూ
బలాన్ని నిరూపిద్దాం
సంఘటిత గీతాన్ని
ప్రపంచం కదలిపోయేలా ఆలపిద్దాం
చివరి క్షణం వరకూ
పోరాట పిడికిలిని
న్యాయం కోసమే గురిపెడదాం
- పద్మావతి రాంభక్త
99663 07777