ఎట్టకేలకు శెట్టిపల్లికి మోక్షం
ప్రజాదృష్టి
ప్రజాశక్తి-తిరుపతి సిటి
శెట్టిపల్లి భూములు ఇది దశాబ్దాలుగా కొలిక్కిరాని సమస్య. రాష్ట్ర వ్యాప్తగా చర్చనీయాంశమైన అంశం. అక్కడి రైతుల ఔదార్యం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి నాంది అయ్యింది. కానీ రైతులకు మాత్రం పంటలు పండే భూములు కూడా కనుమరుగయ్యాయి. తమ అధీనంలోనే భూములు ఉన్నా పట్టాలు మాత్రం లేవు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతుల సమస్య మాత్రం ఎక్కడేసిన గొంగిడి అక్కడే అన్నట్టుగా తయారైంది. ఎట్టకేలకు స్థానికులు, రైతులు గట్టిగా నిలబడడంతో, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. స్థానిక ఎంఎల్‌ఏ చొరవ చూపడంతో అధికారులు దృష్టి సారించారు. మూలనపడి ఉన్న పైల్‌కు చలనం వచ్చింది. ప్రభుత్వ అంగీకారంతో రైతులకు పట్టాలు అందించి, సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపడం గమనార్హం.
శెట్టిపల్లి పంచాయతీ. తిరుపతి రూరల్ మండలంలోని మేజరు పంచాయతీల్లో ఒకటి. విశాలమైన భూములు, సారవంతమైన నేలలు..చుట్టు పంటపొలాలు. ఒకవైపు రైతులు నివాసులు, మరోవైపు నిత్యం నీటితో కళకళలాడే చెరువు, ఇంకో వైపు రైల్వేకోచ్ ప్యాక్టరీ (సిఆర్‌ఎస్), శేషచల కొండలకు అతి చేరువలో, రైల్వేజంక్షన్ రేణిగుంటకు, ఆధ్య్యాత్మిక కేంద్రం తిరుపతికి మద్య ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుందా ఊరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పడు చుట్టు బీడుభూములు, తాగేందుకు చుక్క నీరు లేకుండా, పంటలు పండించుకునే అధికారం లేకుండా అక్కడ రైతుల బాధలు వర్ణానాతీతం. ఈ భూములకు పట్టాలు లేకపోవడం నిత్యం ప్రభుత్వంతో పోరాటమే. దశాబ్దాల తరబడి రైతులు పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన శెట్టిపల్లికి శాపంగా మారింది. అక్కడున్న సారవంతంమైన, విశాలమైన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో చేసిన విధంగా శెట్టిపల్లిభూములను ల్యాండ్‌ప్యూల్లింగ్ ద్వారా తీసుకుని, అభివృద్ధి చేయాలని భావించింది. అందుకు 2018లో నోటిఫికేసన్ జారీ చేసింది. సుమారు 600 ఎకరాలు సేకరించారు. ల్యాండ్‌ప్యూల్లింగ్‌లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా రైతులకు ఎకరాకు 362 అంకణాలు (30.16సెంట్లు) భూమి ఇస్తామన్నారు. ఇళ్లస్థలాల యాజమానులకు ఒకటిన్నర సెంటు (18 అంకణాల) భూమిని అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. ఆ పరిహారం చాలదు రైతులకు ఎకరాకు 400 అంకణాలు (33.33 సెంట్లు) ఇవ్వాలని పట్టుబట్టారు. దీన్ని తేల్చకుండా గత ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసింది. ఇంతలోనే ఎన్నికల నోటిఫికెషన్ వచ్చింది. ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం కొలవుదీరింది. టిడిపి కంటే మెరుగైన పరిహారం ఇస్తామన్నారు. కొత్త సర్కారు న్యాయం చేస్తుందని భూ యజమానులు ఆశించారు.
తుడా టౌన్‌షిప్ తెరపైకి
2019లో తుడా ఆద్వర్యంలో ఆ ప్రాంతంలో టౌన్‌షిప్ నిర్మాణానికి అంగీకరించారు. 2019 జూన్ 26న రెవిన్యూ, తుడా నేతృత్వంలో భూముల సర్వేకు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హాయాంలో చేసిన సర్వే, హక్కుదారులు సమర్పించిన రికార్డులు చెల్లవంటూ... మరోసారి భూ సర్వేకు, హక్కుదారుల రికార్డులు పరిశీలనకు తెరతీశారు. పాలకుల నిర్ణయాల కారణంగా 251 రైతులు, 2206 మంది ఇళ్ల స్థలాల కొనుగోలుదారులు మరోసారి రికార్డులు సమర్పించారు. ఈ నేపథ్యంలో 2019 ఆగస్టు 4న ఆర్‌డివో నేతృత్వంలో శెట్టిపల్లి భూ బాధితులతో తొలిసమావేశం నిర్వహించారు. భూములు సేకరణ, టౌన్‌షిప్ నిర్మాణం, పరిహారం విషయంపై చర్చించారు. అందరికి అమోదయోగ్యమైన పరిహారం ఇవ్వాలని రైతులు స్పష్టం చేశారు. అనంతరం సెప్టెంబరు 28న అర్హులు, లబ్దిదారుల జాబితాను ప్రకటించారు. టౌన్‌షిప్ నిర్మాణానికి ముందుకెళ్లుతున్నట్లు తుడా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదైనా కార్యచరణ ప్రారంభం కాలేదు.
విలీనానికి నాంది
తుడా టౌన్‌షిప్ నిర్మాణం కాలయాపన జరుగుతుందని తెలుసుకున్న స్థానిక ఎంఎల్‌ఏ శెట్టిపల్లిని కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు పూనుకున్నారు. పంచాయతీలోని గ్రామపాలకమండలిని సమావేశపరిచి, గ్రామసభలో అందుకు తగ్గట్టు తీర్మానం చేయించారు. విషయం తెలుసుకున్న తుడా అధికారులు తమకు కేటాయించిన 137.85 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలకు పూనుకున్నారు. సంబంధిత అధికారులు 2023 జనవరి 11న 4 బృందాలుగా సర్వేకు వెళ్లారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి కలెక్టరేట్‌లో చక్రం తిప్పి సర్వే అధికారులను ఉన్నఫలంగా వెనక్కి రప్పించారు. పరిస్థితి చేయదాటకముందే తేరుకోవాలని భావించిన ఆయన విలీనానికి చర్యలు ముమ్మరం చేశారు. యుద్ద ప్రతిపాదికన మూడే మూడు రోజుల్లో వీలిన ప్రక్రియను పూర్తి చేశారు. 01.03.2023లో అందుకు సంబంధించిన ప్రభుత్వం గెజిటెడ్ విడుదల చేసింది. కోట్ల విలువ చేసే శెట్టిపల్లిభూముల్లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఏలు మధ్య ఆదిపత్య పోరు తప్పలేదు. విలీనం అయినా అక్కడ వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. శెట్టిపల్లి భూములను ఎప్పటికి శాపవిమోచన జరుగుతుందోనని అక్కడి రైతులు ఎదురుచూశారు. ఎట్టికేలకు త్వరలో జరుగబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాబోలు ఏదో విధంగా రైతుల భూములకు పట్టాల పంపిణీకి స్థానిక ఎంఎల్‌ఏ చొరవ చూపారు. అంతే అనుకున్నదే తడువుగా మూలనపడ్డ పైల్‌కు చలనం వచ్చింది. ఆగమేఘాలపై అమరావతిలో ఉన్నతాధికారులు చర్చించి, పట్టాలకు అంగీకరించి, సిఎంకు ఆమోదాన్ని సైతం పొందారు. అందరు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నవంబరు 1వ తేదిన శెట్టిపల్లి రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి చేరుకుని పట్టాలను అందజేశారు. దీంతో రైతుల మోహాల్లో ఆనందం వెల్లివిరిసింది.










