ప్రజాశక్తి- మునగపాక రూరల్
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సమస్య ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రైతుల విజ్ఞప్తి మేరకు పరిహారం పెంపునకు అధికారులు అంగీకరించారు. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం చెల్లింపుపై 2023 డిసెంబర్ 8న మునగపాక మండల పరిషత్తు సమావేశ మందిరంలో పూర్తి స్థాయిలో నిర్వాసితుల లేకుండా ఆర్‌డిఒ చిన్ని కృష్ణ సమావేశం నిర్వహించగా అది అర్ధాంతరంగా ముగిసింది. పంట భూములకు గజానికి రూ.5,600, వాణిజ్య సముదాయాల భూములకు రూ.14,700 పరిహారం చెల్లిస్తామని నాడు ఆర్‌డిఒ చెప్పడంతో నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆర్‌డిఒ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలని, మెరుగైన ప్యాకేజీని ఇవ్వాలనే తదితర డిమాండ్లతో నిర్వాసితుల సంఘం కన్వీనర్ బ్రహ్మజీ నిర్వాసితులతో కలసి డిసెంబరు 23న ఆర్‌డిఒ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఎట్టకేలకు ఆర్‌డిఒ చిన్నికృష్ణ గురువారం అధికారికంగా ప్రకటన చేసి చర్చల్లో పాల్గొన్నారు. పంట భూములకు గజానికి రూ.6,148, వాణిజ్యసముదాయాల భూములకు రూ.15,200 ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో నిర్వాసితులు పరిహారాన్ని అంగీకరించక, భూములు ఇచ్చేదే లేదని తగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో తుది నిర్ణయంగా పరిహారం మీరే నిర్ణయించుకోవాలని ఆర్డీవో సూచించడంతో నిర్వాసితులు పంట భూములకు గజానికి రూ.11,000, వాణిజ్య సముదాయాల భూములకు రూ.18,000 చెల్లించాలని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. వారు కోరిన పరిహారాన్ని చెల్లించేందుకు ఆర్‌డిఒ చిన్నికృష్ణ అంగీకారం తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై ప్రారంభం నుండి అగ్ర భాగాన నిలిచిన నిర్వాసితుల సంఘం కన్వీనర్ బ్రహ్మాజీని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘ ప్రతినిధులు పొలిమేర గణేష్, బొడ్డేడ సోమసుందరరావు, పెంటకోట జగన్నాథరావు, ఏవి సత్యనారాయణ, వేగి వీరి నాయుడు, ఆడారి పోలయ్య, పెంటకోట కాశి, బీశెట్టి మాధవ, సూరిశెట్టి నారాయణరావు, పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు.










