Oct 11,2023 22:15

జగనన్న హౌసింగ్‌ కాలనీ

ఎట్టకేలకు గృహోత్సవాలు
అనంతపురం ప్రతినిధి :
అనేక వాయిదాల తరువాత నేడు గృహ ప్రవేశాలకు ముహూర్తం కుదిరింది. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలోని సజ్జలదిన్నె గ్రామ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌గా దీనిని ప్రారంభించనున్నారు. రెండు సంవత్సరాలుగా ముహుర్తాలు పెట్టడం, తరువాత వాయిదా వేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు వాటిని ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.
20,345 గృహాలు ప్రారంభం
అనంతపురం జిల్లా 1,00328 గృహ పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 76,169 గృహాలు మంజూరయ్యాయి. ఇప్పటికి 20,345 గృహాలు ఇప్పటికీ పూర్తయ్యాయి. అనంతపురం నియోజకవర్గం పరిధిలో 2275, గుంతకల్లు నియోజకవర్గం పరిధిలో 3126 గృహాలు, శింగనమల నియోజకవర్గం పరిధిలో 2298 గృహాలు, తాడిపత్రిలో 1265, రాప్తాడులో 3013, కళ్యాణదుర్గంలో 1789, రాయదుర్గంలో 1522, ఉరవకొండలో 5075 గృహాలు పూర్తయ్యాయి. మొత్తంగా 20,345 గృహాలు పూర్తయ్యాయి. ఇంకా 55,824 గృహ నిర్మాణాలు పూర్తవ్వాల్సి ఉంది.
ఇంకా పూర్తవని మౌళిక సదుపాయాలు
జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన పూర్తవలేదు. మొత్తం 216 కాలనీల్లో నీటి సరఫరా కోసం పనులు చేపడితే ఇంకా సగం కాలనీల్లో పూర్తవలేదు. 508 పనులు చేపడితే అవి కూడా సగానికి సగం పూర్తవలేదు. ముఖ్యమంత్రి ప్రారంభించే సజ్జలదిన్నె కాలనీలోనూ ఇంకా మౌలిక సదుపాయల కల్పన పూర్తవలేదు. అంతర్గత రహదారులు పూర్తవ్వాల్సిఉంది. ఇళ్ల నిర్మాణాలు కొంతవరకే పూర్తయ్యాయి. అనేక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు.
గతేడాది ఉగాదిలోనే ప్రారంభిస్తాం
ఇళ్ల నిర్మాణాలను గతేడాది ఉగాదిలోనే ప్రారంభిస్తామని హడావుడి నడిచింది. తరువాత ఇది వాయిదా పడింది. అనంతరం మరో రెండు పర్యాయాలు తేదీలు ఖరారైనప్పటికీ పూర్తవకపోవడంతో వాయిదాలుపడ్డాయి. ఎట్టకేలకు మూడో వంతు వరకు ఇళ్లు పూర్తయ్యాయి. తక్కిన ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాల్సి ఉంది. కొన్ని చోట్ల కేటగిరి-3 కింద చేపట్టిన ఇళ్లు కూడా పూర్తవలేదు. కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణాలు అప్పగించినప్పటికీ అవి కొంత వరకు మాత్రమే పురోగతి సాధించాయి. ఆ కాలనీల్లోనూ ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని లే అవుట్లలో ప్రారంభానికే నోచుకోలేదు. అనంతపురం నగరం పరిధిలో ఒక లేఅవుట్‌లోనే సుమారు ఐదు వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కాని స్థలం అనుకూలంగా లేకపోవడంతో ఆ లేఅవుట్‌ను రద్దు చేశారు. ఆ స్థానంలో కొంత లేఅవుట్‌ ఇప్పటికీ గుర్తించలేదు. దీంతో నగరంలో ఐదు వేల మంది ఇంకా ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తేనే ఉన్నారు.