
ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం చీమల పాడు శివారు కళ్యాణపులోవ జిసిసి రేషన్ డిపో పరిధిలో ఆదివాసి రేషన్ లబ్దిదారులకు ఎట్టకేలకు బియ్యం పంపిణి చేపట్టారు. సిపిఎం, ఎపి ఆదివాసీ గిరిజన సంఘంతో పాటు పలు ప్రజాసంఘాల పోరాటం ఫలితంగా మార్చి, ఏప్రిల్ నెలలకు చెందిన మూడు టన్నుల బియ్యన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు శుక్ర, శనివారాలలో పంపిణి చేశారు. జెడ్. జోగింపేట, రొచ్చుపనుకు, తాడిపర్తి, బంగారు బందల, ఆజేయపురం తదితర గిరిజన గ్రామా ల్లోని 236 మంది రేషన్ కార్డుదారులకు మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి మూడు టన్నుల ఉచిత బియ్యం ఇవ్వాల్సి ఉండగా వారితో వేలిముద్రలు వేయించుకుని డిపో సేల్స్ మెన్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. సీపీఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులతో ఆందోళనలు చేపట్టడం తో పాటు స్పందనలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ఏప్రిల్ 17న పలు వార్త పత్రికలలో కధనాలు ప్రచురితమయ్యాయి దీనిపై రావికమతం తహసీల్దార్ మహేశ్వరరావు, సీఎస్‌ఓటీ ఈశ్వరరావు విచారణ చేపట్టి సేల్స్ మెన్ అప్పారావు బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. సేల్స్ మెన్‌పై 6ఎ కేసు నమోదు. చేశారు. రెండు నెలల బియ్యం తిరిగి ఇస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. నెలలు గడిచినా బియ్యం ఇవ్వక పోవడంతో ఇటీవల సీపీఎం నాయకులు ఆధ్వర్యంలో మరో మారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి స్పందనలో పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలని డీఎస్‌వోను ఆదేశించారు. దీంతో, సీఎస్‌డిటి ఈశ్వరరావు కల్యాణపులోవ జీసీసీ సేల్స్ డిపో వద్ద శుక్ర, శనివారాల్లో బియ్యం పంపిణీ చేయించారు.