
ప్రజాశక్తి - కొమరాడ : జంఝావతి జలాశయం ద్వారా ఎత్తిపోతల పథకంలో భాగంగా రైతులకు సాగునీరు అందించాలని టిడిపి అరకు పార్లమెంటరీ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు అన్నారు. మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామ పరిధిలో గల వాసిరెడ్డి కృష్ణమూర్తి రిజర్వాయర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ఎత్తిపోతల పథకం కింద సాగునీరందాల్సిన పరిస్థితిలో కరెంట్ బిల్లు కట్టలేదని ట్రాన్స్‌ఫార్మర్ కొత్తది వేయాలని, రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని సాకులు చెప్పి సుమారు 3వేల ఎకరాలకు సాగునీరందించకుండా రైతులను నష్టపర్చడం భావ్యం కాదన్నారు. రైతాంగానికి అండగా నిలబడ్డానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం రైతు గర్జన కార్యక్రమాన్ని జనసేన, తెలుగుదేశం సంయుక్తంగా నిర్వహించాయని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా చివర రైతులకు సాగునీరు అందుకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు. కనీసం సాగునీరు వెళ్లేందుకు కాలువ పనులు కూడా సక్రమంగా లేకపోతే నీరు ఎలా రైతులకు అందుతుందని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నంగి రెడ్డి మధుసూదన్ రావు, నందివాడ కృష్ణబాబు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరిశర్ల సింహచలం, జనసేన జిల్లా కార్యక్రమల నిర్వహణ కార్యదర్శి పెంట శంకరరావు తదితరులు ఉన్నారు.