Jan 23,2023 23:57

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న కార్మిక, రైతు నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలోని ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ గత నాలుగేళ్లుగా కార్మికులకు బకాయి పడ్డ జీతాలు రూ.8 కోట్లు తక్షణమే చెల్లించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు గుండుబోగుల గోవిందరావు, కరెడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ళుగా ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. తక్షణమే కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి బకాయి జీతాలు చెల్లించాలని, ఫ్యాక్టరీని తెరిపించి క్రషింగ్‌ నిర్వహించాలని, రైతులను చెరకు పండించేందుకు ప్రోత్సహించాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, యూనియన్‌ నాయకులు కోరిబిల్లి రమణ, అల్లు నారాయణమూర్తి, పి.వెంకన్న, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు పాల్గొన్నారు.