
ప్రజాశక్తి-యస్.రాయవరం:మూసి వేసిన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మికులకు రూ. 6కోట్ల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని శుక్రవారం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఫ్యాక్టరీ అకౌంటెంటు ఆఫీసర్ మురళీకృష్ణనకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటి కో ఆపరేటివ్‌లో ఏర్పడిన ఘణమైన చరిత్ర కలిగిన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం తగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ మహాసంకల్ప పాదయాత్రలో భాగంగా 2018 ఏడాదిలో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన సభలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ని ఆధునీకరించి నడిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోలేదని, పైగా ఫ్యాక్టరీని మూసి వేసి కార్మికులకు, రైతులకు తీవ్రంగా అన్యాయం చేశారని దుయ్యబట్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఏటికొప్పాక ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కార్మికులకు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యూనియన్ నాయకులు కె.సత్యనారాయణ, ఏ నారాయణమూర్తి, కె.రమణ, గోవిందు, రమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.త్రినాధరావు, జీ డేవిడ్ రాజు పాల్గొన్నారు.