ప్రజాశక్తి- ఎస్.రాయవరం: వేతనాలు చెల్లించకపోతే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు హెచ్చరించారు. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రూ.8 కోట్లు బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా చెల్లించాల్సిన పెండింగ్ బకాయి వేతనాలు 8 కోట్లు రావాల్సి ఉందని, ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఈనెల 28న అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని తెలిపారు. 3 సంవత్సరాలుగా జీతాలు చెల్లించలేదని, గత 2 సంవత్సరాలుగా ఫ్యాక్టరీని మూసివేయడం జరిగిందని, దీంతో పస్తులతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ లను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారని, మూడున్నర సంవత్సరాలు అవుతున్నా నేటికీ షుగర్ ఫ్యాక్టరీ లను ఆదుకోలేదని తెలిపారు. పైగా కష్టించి పని చేసిన వారికి కూడా వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, కార్మిక సంఘం నాయకులు కె.సత్యనారాయణ జీ.గోవిందరావు ఎం.సూర్యారావు ఆర్.హానుమంతురావు, రాజు, కె.రమణ, పీ.గోవింద్, ఏ.నారాయణమూర్తి, పీ.వెంకన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.త్రినాధరావు, జిల్లా కమిటీ సభ్యులు కె.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










