Nov 22,2020 12:06

ఏటిగట్టు మా ఊరికే కాదు
చుట్టుపక్కల చాలా ఊళ్లకు
రక్షణ కవచంగా నిలుస్తుంది

ఏటు గట్టు మీద ప్రయాణం
ఎంతో హాయి గొలుపుతుంది
గోదారమ్మ అందాలన్నీ
తనివితీరా గ్రోలాలనిపిస్తుంది

ఏటుగట్టెక్కితే ఎవరెస్ట్‌ శిఖరం
ఎక్కిన అనుభూతి కలుగుతుంది

ఏటుగట్టు పెద్ద తల్లైతే
కాలువగట్టు చిన్న తల్లే
కాలువ గట్టు మీద
కాడమల్లే పూల గుబాళింపు
ఆస్వాదించాల్సిందే
కాలువగట్టు పై నుంచి
కాలువలోకి తొంగిచూస్తే
శీర్షాసనం వేసే మొక్కల
అందాలు తనివి తీరదు

బల్లకట్టుపై ప్రయాణం
నాన్న వీపుపై సవారీలా అనిపిస్తుంది

కాలువకు కొత్త నీరు వచ్చినపుడు
గంగమ్మ తల్లికి సమర్పించే ముడుపులు
ఒక మధురమైన తీయని జ్ఞాపకం

తాగునీరు సాగునీరు అందించే
చల్లని తల్లి గోదారమ్మ
అరుదైన మత్స్య సంపదకు
ఆలవాలం

ఏటుగట్టు కాలువగట్లు
భూ బకాసురుల కబంధ హస్తాలలో
నలిగి పోవటం
గట్లు బలహీనపడటం
ఉపద్రవం ఎప్పుడొచ్చి
మీద పడుతుందో
తెలియకపోవటం
కునుకు పట్టక పోవటం
గట్లు ఆక్రమణలు తొలగించాలి
గోదారమ్మ శాంతించాలి
చల్లగ అందరూ హాయిగా జీవించాలి

- గాదిరాజు రంగరాజు
8790122275