Nov 21,2023 22:30

ఎస్‌వియూలో ఘర్షణ

ఎస్‌వియూలో ఘర్షణ
- క్యాంటీన్‌ వద్ద బయట వ్యక్తుల బాహాబాహి
- భయాందోళనలో విద్యార్థులు
ప్రజాశక్తి - క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొంతకాలంగా బయట వ్యక్తుల అసాంఘిక కార్యకలాపాలతో వర్సిటీ వాతావరణం మొత్తం పూర్తిగా గాడి తప్పింది. వర్సిటీలో ఉదయం, సాయంకాలం సమయంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న పూర్వ విద్యార్థులు, వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కాకుండా బయట వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలతో పాటు కొన్ని అనైతిక కార్యక్రమాలకు కూడా ఎస్‌ వి యూనివర్సిటీ అడ్డగా మారిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విషయం విద్యాలయం ఉపకులపతి, రిజిస్ట్రార్‌ కు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా భద్రతా సిబ్బందిని పెంచడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం వర్సిటీ క్యాంపస్‌లో క్యాంటీన్‌ ఎదుట బయట వ్యక్తులు రెండు గ్రూపులుగా వచ్చి బాహాబాహీగా కొట్టుకోవడంతో అక్కడున్న సిబ్బంది, విశ్రాంత బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఏమీ తోచని దిక్కులేని స్థితిలో కొంత మంది విద్యార్థులు నేతలు వెంటనే వర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ కి చరవాణి ద్వారా సమాచారాన్ని అందించారు. అప్పటికే వర్సిటీలో జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. దీన్ని పరిశీలిస్తే మూడు సంవత్సరాలుగా వర్సిటీలో భద్రత వ్యవస్థ పూర్తిస్థాయిలో దారి తప్పిందని చెప్పవచ్చు. వర్సిటీ పాలకుల ఉదాసీనత వ్యవహారంతో పరిస్థితిలో భద్రత వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని విద్యార్థి సంఘాల నేతలు, బోధన, బోధనేతర సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు భద్రతా సిబ్బందినీ పెంచి బయట వ్యక్తులు వర్సిటీలో క్యాంపస్‌లోకి రానివ్వకుండా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో అఖిల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.