ప్రజాశక్తి-అరకులోయ రూరల్:రాష్ట్రం ప్రభుత్వం బోయవాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు జిఓ నెం 52ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపులో భాగంగా గురువారం అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ శరభగుడ గ్రామంలో గిరిజన సంఘం అధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడారు. బోయవాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం కలుగుతుందని, గిరిజన హక్కులు, చట్టాలకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. జీఓ 52తో గిరిజన జీవితాలను చీకటి మయం చేసిందని పేర్కోన్నారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌళిక సదుపాయాలు కల్పనలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు. వెనకబాటు తరగతులను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం స్వప్రయోజనాలు, ఎన్నికల్లో ఓట్ల కోసం బోయవాల్మికి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో జాబితాలో చేర్చాలనే నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన బిడ్డలను మోసం చేసినట్టేనని ఆయన విమర్శించారు. ఈ విషయంపై స్థానిక గిరిజన సంఘాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జీఓ 52ను రద్దు చేసే విధంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కమిటీ కార్యదర్శి పి.రామన్న, గిరిజన సంఘం నాయకులు కె.జగన్నాధం, టి.హరి, శరభగుడ యూత్ పాల్గొన్నారు.
ఎస్టీ జాబితాలో చేర్చడం తగదు
ప్రజాశక్తి -పాడేరుబోయ వాల్మీకి, ఒడిస్సా ప్రాంతం నుండి వలస వచ్చిన బెంతు, ఒరియా (ఒడియా బ్రహ్మణ) కులాలను తమ రాజకీయ అవసరాల కోసం ఎస్టీ జాబితాలో చొప్పించి షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసులకు రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందకుండా చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ రామారావు దొర ఆవేదన వ్యక్తం చేసారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, బోయ వాల్మీకీ, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి షెడ్యూల్డ్ ప్రాంత తెగలు పొందుతున్న రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా అందకుండా చేయడానికి పాలకులు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఆదివాసి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలని, లేకుంటే ద్రోహులుగా మిగిలి పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ ముఖ్య సలహాదారులు సొనాయి గంగారజు, బుడిదే సుమన్, కిరసని కిషోర్, బుడిదే మాధవరావు, ప్రభాకర్, మనుగురు ప్రశాంత్, వెంకట్, సూరిబాబు,రవీంద్ర, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.










