ప్రజాశక్తి - మేదరమెట్ల
స్థానిక ఎస్టీ కాలనీకి గత 16రోజుల నుండి త్రాగునీరు రావటం లేదని, అసలు నీరు ఇస్తారా, లేదా అని కొరిసపాడు సిపిఎం కన్వీనర్ ఎం ఆంజనేయులు ప్రశ్నించారు. మెదరమెట్లలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. గత 10వ తేదీ నుండి నేటి వరకు మంచినీరు రావడంలేదని అన్నారు. పంచాయితీ కార్యదర్శి, ఈవోఆర్డిని కోరినా ఫలితం లేదని అన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఎస్టీ కాలనీపై నర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. ఎరుకల, యానాది కులస్తులనే చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. ఇన్ని రోజుల నుండి మంచినీరు రాకపోతే పట్టించుకోకుండా ఉండటం అన్యాయమని అన్నారు. వాటర్ లైన్ రిపేర్ చేసే అవకాసం లేనప్పుడు ప్రత్యామ్నాయన్ని కూడా వెతకాలని అన్నారు. తాగునీళ్లు ఇవ్వకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వై రవీంద్రబాబు, కె సురేష్ బాబు పాల్గొన్నారు.










