ప్రజాశక్తి-డుంబ్రిగుడ: బోయ వాల్మీకి, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చితే ఉద్యమ పోరు సాగించక తప్పదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని సాగర గ్రామంలో పంచాయతీ గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ఆదివాసీ సంస్కతి ఆచారాలతో పాటు సంప్రదాయాలు దెబ్బ తీసే విదంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో దశలవారీ ఆందోళన చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై గిరిజన ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలు, గిరిజన ఉద్యోగ మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఏకమై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాగిరి రామచందర్, చెడ్డ రామచంచర్, ప్రజాప్రతినిధులు ఎంపిటిసి వంతాల దేవదాసు, తౌడమ్మ పాల్గొన్నారు.










