Oct 23,2022 23:33

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైసీపీ ప్రభుత్వం శామ్యూల్‌ కమిటీని నియమించి, జిఓ 52 జారీ చేయడంపై సహించేది లేదని డిఎల్‌ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సమరెడ్డి మాణిక్యం, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కామేశ్వరరావు తెలిపారు. ఆదివారం అరకులోయ గవర్నమెంట్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గిరిజన హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నా యన్నారు. ఆదివాసి గిరిజన నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జిఓ 3 రద్దు చేయడంతో నిరుద్యోగులు వందలాది మంది ఉపాధి లేకుండా ఉన్నారన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి తెగలను ప్రభుత్వ వెబ్‌ సైట్‌ నుంచి తొలగించిందని, దీంతో ప్రజాసంఘాలు పోరాటం చేయడంతో మళ్ళీ పునరుద్ధణ చేయడం జరిగిందన్నారు. నూతన అటవీ పాలసీ విధానం తీసుకొచ్చి ఆదివాసీ గిరిజన బిడ్డలను అడివి నుండి గెంటేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. జీవో 52పై గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఓ జిల్లా సెక్రెటరీ భీమేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనువాస్‌రావు, జిల్లా ముఖ్య నాయకులు రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసన్న కుమార్‌, దండకారణ్య రాష్ట్ర విద్యార్థి సమితి ఇంచార్జి జాన్‌ బాబు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, దండకారణ్య రాష్ట్ర ఉద్యోగ సమితి కార్యదర్శి సూర్య ప్రకాష్‌, విద్యార్ధి సమితి జిల్లా ఇన్చార్జి అంజలిరావు, నారాయణ పాల్గొన్నారు.