Nov 05,2023 22:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ రాష్ట్రంలో ఎస్‌సి సామాజికవర్గీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టిడిపి ఎస్‌సి సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కంచికచర్లలో పాత గొడవల నేపథ్యంలో ఓ ఎస్‌సి యువకుడుపై జరిగిన అమానుష సంఘటనకు వ్యతిరేకంగా ధవలేశ్వరం గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌సి సెల్‌ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎస్‌సిలకు కళ్లబొళ్లి కబుర్లు చెప్పిన జగన్‌ రెడ్డి సిఎం అయ్యిన తరువాత ఆ ఎస్‌సిలకు భద్రత లేకుండా పాలన సాగిస్తున్నారని విమర్శంచారు. ఎస్‌సిలను కిడ్నాపు చేసి హత్యలు, దాడులు చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎస్‌సి వర్గీయులంతా జగన్‌ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ నాయకులు తలారి మూర్తి, జె.కృపారావు, సింగ్‌ సురేంద్ర, ముచ్చి నాని, శీలం రవి, ఆర్‌.ఆంటోనీ, కె.సత్యనారాయణ, జనసేన నాయకుడు బీర జయ ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.