ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జి.ఆనంద్ చైతన్య మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలు ఈనెల 10 నుంచి 22 వరకు ఎమ్మిగనూరుతో పాటు అన్ని మండలాల్లో కొనసాగుతాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి అధికారం చేపట్టి పదేళ్లు గడుస్తున్నా హామీని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. నాడు కడప ఎంపీగా ఉన్న జగన్ ఎస్సీ వర్గీకరణను సమర్థించి కేంద్రానికి లేఖ రాశారని, నేడు పట్టించుకోకపోవడం మాదిగలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఈ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను విస్మరించే పార్టీలకు 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఎంఆర్‌పిఎస్ నాయకులు హాలహర్వి ఏసన్న మాదిగ, ప్రభాకర్ మాదిగ, ప్రసాద్ మాదిగ, దేవరాజు మాదిగ మొదటిరోజు దీక్షలో కూర్చున్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) నాయకులు దివాకర్ చైతన్య మాదిగ, ప్రకాష్ మాదిగ, పౌలు మాదిగ, సంజులు, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు హాలహర్వి దావీదు, ముగతి బాలరాజు పాల్గొన్నారు.
దీక్షలను ప్రారంభిస్తున్న నాయకులు










