Sep 19,2023 19:31

దీక్షలకు మద్దతు తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎస్సీ వర్గీకరణ ద్వారానే దళితుల్లోని ప్రతి కులానికీ రిజర్వేషన్ల ఫలాలు అందుతాయని, రిజర్వేషన్లు పొందే దగ్గర దళితుల మధ్య అసమానతలు ఉన్నాయనేది దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు తేల్చి చెప్పాయని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ఆనంద్‌ చైతన్య మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని చేపట్టిన మాదిగల నిరసన దీక్షలు మంగళవారం 10వ రోజుకు చేరుకున్నాయి. టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, వక్ఫ్‌ బోర్డు జిల్లా మాజీ డైరెక్టర్‌ జి.అల్తాఫ్‌, రాష్ట్ర ఉపర (సగర) ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉప్పర ఆంజనేయులు, ఆత్మ మండల మాజీ ఛైర్మన్‌ కందనాతి శ్రీనివాసులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎంఆర్‌పిఎస్‌ నాయకులు మాట్లాడుతూ... ఈనెల 22 వరకు జరిగే అమృత కాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి నేడు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ దీక్షల్లో ముగతి కుమార్‌, హాలహర్వి భాస్కర్‌, మాచాపురం నాయకులు పి.రవికుమార్‌, ఎస్‌.శాంతిరాజు, పెద్ద శాంతిరాజు ఉన్నారు.