Sep 12,2023 20:11

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి - మంత్రాలయం
వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్‌ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి 13 జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు దశాబ్ధాలైన కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ ఉద్యమం వర్గీకరణతో పాటు మాదిగల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఎన్నో హక్కులను సాధించుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పు, డప్పు కొట్టు కళాకారులకు పింఛను రూ.5 వేలకు పెంచాలని, ప్రతి జిల్లా, మండలాల్లో చెప్పుల కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి మాదిగ నిరుద్యోగ యువతకు కేటాయించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌ పథకాలను పునరుద్ధరించి, లీడ్‌ క్యాప్‌కు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలిగిరి రవి మాదిగ, జిల్లా మహిళా అధ్యక్షులు కదిరికోట బతుకమ్మ, జిల్లా ప్రధాన కన్వీనర్‌ రేపల్లె సామ్యేల్‌ మాదిగ, మంత్రాలయం తాలూకా ఇన్‌ఛార్జీ దేవపుత్ర, ఎమ్మిగనూరు అధ్యక్షులు మారెప్ప, ఇన్‌ఛార్జీ సుమాల చార్లెస్‌ పాల్గొన్నారు.