May 21,2023 20:20

ఆదోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో కిటికీలకు పగిలిన అద్దాలు

ప్రజాశక్తి - ఆదోని
కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని ప్రగల్బాలు పలకడం పాలకులకు షరా మామూలు అయింది. కార్పొరేట్‌ కాదు కదా కనీసం దోమలు, ఈగల బారిన పడకుండా కూడా నివారణ చర్యలు చేపట్టలేని పరిస్థితుల్లో అధికారులు ఉంటున్నారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో చదువు ఎలా కొనసాగేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది.
ఆదోని సబ్‌ డివిజన్‌లోని బాలబాలికలకు మెరుగైన వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ఆదోనిలో బాలికలు, ఆలూరు, నందవరం ప్రాంతాల్లో బాలురకు ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టల్‌లో 4 నుంచి 10వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునే సౌలభ్యం ఉంది. ఒక్కో హాస్టల్‌లో 400 మంది విద్యార్థులు వసతి పొందేందుకు భవనాల నిర్మాణం జరిగింది. మొదట్లో భవనాలు సుందరంగా ఉండేవి. ప్రస్తుతం పాడుపడిన వాటిలా కనపడుతున్నాయి.
కరువైన ఆలనా పాలన
ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన నిర్మాణాలు జరిగి దశాబ్ద కాలం గడిచిపోయింది. అప్పటి నుంచి భవనాల గోడలకు సున్నం, రంగులు వేయడం మరిచారు. కిటికీల అద్దాలు పగిలిపోవడంతో ఈగలు, దోమలు ఆహార పదార్థాలపై వాలి విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో వర్షపు జల్లులు గదుల్లోకి వీస్తుండడంతో పుస్తకాలు, బట్టలు తడిసిపోతున్నాయి. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో చలికాలంలో చలి తీవ్రతకు తట్టుకోలేక అట్టలు ఉంచిన చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి ఉంది.
తాగునీటికి తప్పని ఇబ్బందులు
ఆదోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీగా మున్సిపల్‌ ట్యాంకర్‌ నీటిపైనే ఆధార పడాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా నేరుగా కుళాయి ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పేద పిల్లలు ఉండే వసతి భవనాల పట్ల అధికారులకు ఎందుకు కనికరం చూపడం లేదని పలువురు నిలదీస్తున్నారు. నాడు-నేడు కింద స్కూల్‌ భవన నిర్మాణ రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం హాస్టల్‌లో మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని, ఇలా అయితే విద్యార్థులు ఉండలేక హాస్టళ్లు మూతపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ మాసంలోనైనా భవన నిర్మాణ మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
- సుధాకర్‌, ఎఎస్‌డబ్ల్యుఒ, ఆదోని

ఆదోని సబ్‌ డివిజన్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఎస్సీ హాస్టల్‌లో మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, నందవరం హాస్టళ్లలో పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. నిధులు రాగానే యుద్ధప్రాతిపదికన కిటికీలకు అద్దాలు, గోడలకు రంగులు, ఇతర మరమ్మతు పనులు చేయిస్తాం. అధైర్య పడాల్సిన అవసరం లేదు.
నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేస్తాం
- శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి, ఆదోని

హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలోపు తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలి లేకపోతే విద్యార్థులను సమకూర్చి ఆందోళనలు నిర్వహిస్తాం. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకుండా కాలయాపన చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం.