Aug 18,2023 00:21
జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న దళిత నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీల బలోపేతానికి కాల పరిమితిని తొలగించాలని దళిత గిరిజన బడ్జెట్‌ వాచ్‌ బాపట్ల జిల్లా చైర్మన్‌ దేవరపల్లి డేవిడ్‌ రాజ్‌ కోరారు. ఈ మేరకు గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషాకు దళిత గిరిజన బడ్జెట్‌ వాచ్‌ కమిటీ సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రతి ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన నిధులు తర్వాత ఏడాది దళిత గిరిజనుల అభివృద్ధికి ఉపయోగించి దళితుల చట్టాన్ని బలోపేతం చేయాలని అన్నారు. చట్టంలోని సెక్షన్‌ 21(1) ప్రకారం సబ్‌ ప్లాన్‌ బడ్జెట్‌ పర్యవేక్షణకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు సక్రమంగా విధులు, బాధ్యతలు నిర్వహించే విధంగా ఆ కమిటీలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని కోరారు. సబ్‌ ప్లాన్‌ అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు గూదె రాజారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల్లో కనీసం 50శాతం ఎస్సీ ఎస్టీ మహిళల ప్రత్యేక అభివృద్ధి పథకాలకు వెచ్చించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి ఇతర కులాలలో ఉన్న సామాజిక ఆర్థిక అంతరాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, దళిత గిరిజన బడ్జెట్‌ వాచ్‌ జిల్లా కన్వీనర్‌ దార్ల కోటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి ఆర్య, దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ప్రతినిధులు పులిపాటి వీరయ్య, వి భగవాన్‌ దాస్‌ పాల్గొన్నారు.