ప్రజాశక్తి - రేపల్లె
ఎస్సీ, ఎస్టీ రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం విజయవాడ లయోలా కాలేజీ ఆడిటోరియం శనివారం ఉదయం 10గంటలకు జరుగనున్న సదస్సును జయప్రదం చేయాలని జై భీం భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు దోవా రమేష్ రాంజీ కోరారు. ఆయన విలేకర్లతో శుక్రవారం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన 50లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములను కాపాడుకుందాం అనే నినాదంతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అసైన్మెంట్ భూముల ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు 85వ రాజ్యాంగ సవరణను అనుసరించి ఇచ్చిన జీఓ ఎంఎస్ నెం.5, 26లను అమలు చేయాలని కోరారు. మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్నారు. అట్రాసిటీ కేసులలో ముద్దాయిలకు 41సీఆర్పీసి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ అమ్మఒడి, వసతి దీవెన, ఫీజ్ రీ ఎంబర్సుమెంట్ అమలు చేయాలని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అన్నారు. సదస్సులో మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్, ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీ ప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరవు మాదిగ, కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, రెల్లి సంఘ నాయకులు సిరంసెట్టి నాగేంద్రరావు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.










