Apr 28,2023 19:41

ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తున్న ఏపీడీ మల్లేశ్వరి

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారందరికీ తప్పనిసరిగా ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఉండేలా చూసుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారి మల్లేశ్వరి ఆదేశించారు. శుక్రవారం చిప్పగిరి మండల కార్యాలయంలో ఎంపిడిఒ సుధాకర్‌ రాజు అధ్యక్షతన ఎపి మాధవ శంకర్‌ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జాబ్‌ కార్డులు తక్కువగా ఉన్నాయని కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను పరిశీలించి, ఇంటింటికీ వెళ్లి ఉపాధి హామీ జాబ్‌ కార్డులు లేని వారందరికీ చేయించాలని చెప్పారు. జాబ్‌ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని, పనులు కల్పించడంలో అలసత్వం వహించిన వారిపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం దినసరి వేతనం రూ.272 చేసిందన్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.