Jun 18,2023 01:06
వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు

ప్రజాశక్తి-అద్దంకి: బాకీ లేకపోయినా, కిస్తీలు కట్టాలని వేధించటాన్ని ప్రశ్నించిన దళితులపై దాడి చేసిన ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కాకుమాను రవి ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి హౌసింగ్‌ లోన్‌ తీసుకున్నారు. క్రమం తప్పకుండా వాయిదాలు కడుతున్నప్పటికీ, కిస్తీలు కట్టాలని, బాకీ ఉన్నారని కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్స్‌, సెల్‌ ఫోన్‌ మెసేజ్‌లు వస్తుండడంతో, రవి తన బంధువైన కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో కలిసి, శుక్రవారం అద్దంకిలోని ఫైవ్‌స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీకి వెళ్లారు. అక్కడ సిబ్బందిని కలిసి తన సమస్య చెప్పుకున్నారు. తాను బాకీ లేకపోయినా, తనకు వస్తున్న మెసేజ్‌లను మేనేజర్‌ చింతపల్లి శ్రీనివాసరావుకు చూపించారు. ఇదంతా ఫైనాన్స్‌ కంపెనీలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. రవి, శీనులను ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది బలవంతంగా తోసుకుంటూ ఆఫీసు కిందకు తీసుకువచ్చి, సీసీ ఫుటేజీ లేని ప్రాంతంలో దాడి చేసి గాయపరిచారు. ఫైనాన్స్‌ సిబ్బంది దాడిలో, శీను చేతికి రక్త గాయాలు, రవికి కాలు మడిమ దగ్గర గాయమైంది. రవి, శీనుపై దాడి చేయటం చూసి ప్రశ్నించిన వారిపై సైతం ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది దౌర్జన్యం చేశారు. శీను, రవిలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం రవిని ఒంగోలు తరలించాలని స్థానిక వైద్యులు సిఫారసు చేశారు. రవి ఫిర్యాదు మేరకు అద్దంకి పోలీసులు క్రైమ్‌ నెంబర్‌ /2023గా, ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మాల యువకులపై దాడి జరిగిందని తెలియడంతో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, అద్దంకి మాల మహానాడు అధ్యక్షులు కిరణ్‌తో కలసి అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లి బాధితులను పరామర్శించారు. దళితులపై దాడి చేయడమే కాకుండా, తప్పుడు కేసు పెట్టేందుకు ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ ప్రయత్నిస్తున్నాడని తెలిసి, అంజయ్య అద్దంకి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రోశయ్యతో మాట్లాడారు. ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది దళితులే తమపై దాడికి వచ్చారని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, సీసీ ఫుటేజ్‌ పరిశీలించాలన్న అంజయ్య సూచన మేరకు, సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు. అనంతరం ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌, సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. ఈ కార్యక్రమంలో నూకతోటి సుబ్బయ్య, అల్లాడ ఆంజనేయులు, పులిపాటి హేబేలు దారా ఆంజనేయులు, నారాయణ, బొనిగేల దావీదు, గుడిమెట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.