ప్రజాశక్తి-జగ్గయ్యపేట: ఎస్‌సి వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గరికపాడు గ్రామ సమీపంలోని బలుసుపాడు అడ్డరోడ్డు వద్ద, చిలకల్లు గ్రామ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట సిఐ నాగ మురళి, జగ్గయ్యపేట చిల్లకల్లు ఎస్సైలు బి.వి.రామారావు, కే దుర్గాప్రసాద్ ఎంఆర్పిఎస్ నాయకులను అరెస్టు చేసి జగ్గయ్యపేట, చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజులలో ఎస్సీ వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో మంద వెంకటేశ్వరరావు, కూచిపూడి సత్యం, కొల్లూరి బసవ, పల్లెపోగు రాజారావు, మాతంగి దావీదు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల మండలం పేరకలపాడు కాలవ కట్ట సమీపంలో రహదారి దిగ్బంధం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ విశ్వనాథం, మహిళా సమాఖ్య నాయకురాలు జ్యోతి,కోటేశ్వరరావు, ఏసుపోగు వాణి, తవిత,కరుణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు పల్లె వెలుగు బస్సు చక్రాలకు గాలి తీసేయడంతో అందులో ప్రయాణిస్తున్న 50 మందిని మరొక వాహనంలో తరలించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు మండల పరిధిలోని తోటచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎంఆర్‌పిఎస్ నాయకులు సోమవారం ధర్నాకు దిగారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నాయకులను అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వగా నందిగామ ట్రాఫిక్‌లో పని చేసే తిరుమలరావు తలకు గాయం కావడంతో హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలకు పాల్పడిన వారిపై తగ్గు చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.










