ఎస్‌సి రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి
ప్రజాశక్తి - కావలి : 18వతేదీనుండి జరుగనున్న అత్యవసర పార్లమెంట్ సమావేశాల్లో ఎస్.సి. రిజర్వేషన్లకు చట్టబద్ధతను కల్పించాలని, బి.జె.పి. మాదిగలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని మంద కృష్ణమాదిగ ఆదేశాలతో ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి రాష్ట్రకమిటీ పిలుపులో భాగంగా కావలి నియోజకవర్గస్థాయి ''రిలే నిరాహార దీక్షలు'' తహశీల్దారు కార్యాలయం ఎదురుగా ట్రంకురోడ్డుపై మంగళవారం ప్రారంభించారు. ఈ దీక్షలో ఎంఎస్‌పి నియోజకవర్గం కన్వీనర్ అక్కిలిగుంట ఏసుమాదిగ, మండల కన్వీనర్ కత్తి శివయ్యమాదిగ, బోగోలు మండల ఇన్‌ఛార్జి ఐ.మహేష్‌మాదిగ, కర్రా మల్లికార్జున, సాంబశివరావు(ఇస్కపల్లి), ఎం.ఇ.ఎఫ్ జాతీయ నాయకులు మందా వెంకటేశ్వర్లు, ఎంఎస్‌పి జిల్లా నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు దీక్షాదారులకు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని నేటికి 9సంవత్సరాలు కావస్తున్నా వర్గీకరణ చేయకుండా, నిర్లక్ష్యం వహిస్తూ, ఎలాంటి పోరాటాలు, ఉద్యమాలు చేయని అనేక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టుకుని, ఆమోదాలు చేసుకుని, నేటికి 29 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎస్‌సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించక, మాదిగలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ, మాదిగలకు అన్యాయం చేయడం జరుగుతుందన్నారు. 18నుండి 22వరకు జరిగే అత్యవసర పార్లమెంట్ సమావేశాల్లో ఎస్‌సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే బిజెపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బోగోలు, అల్లూరు, కావలి మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.










