ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని బాందేవుపురం గ్రామానికి చెందిన దందేటి మంగమ్మకు ఎస్‌సి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరుతూ భీమునిపట్నం నియోజకవర్గ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర దళిత నాయకులు భాగం గోపాలరావు నాయకత్వంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ, దందేటి మంగమ్మపై గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన కొంత మంది దాడిచేశారని, దీనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదుకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో దరఖాస్తు చేశామని చెప్పారు. దీనిపై గ్రామానికి చెందిన విఆర్‌ఒ శ్రీనివాసరావు ఈ నెల 24న బాధితురాలి ఇంటికి వెళ్లి స్టేట్‌మెంటు నమోదు చేసుకున్నారని తెలిపారు. మరలా 25వ తేదీన వెళ్లి ముందుగా తీసుకున్న స్టేట్‌మెంట్ సరిగా లేదని మరలా ఇవ్వాలని కోరారు. సవాలక్ష ప్రశ్నలు వేసి చివరికి భాదితురాలిని క్రైస్తవరాలుగా చిత్రీకరించారని ఆరోపించారు. అధికారుల విధానం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ, ఎస్‌సి, ఎస్‌టి కింద నమోదు చేసిన కేసును నీరుగార్చేలా ఉందని విమర్శించారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కిశోర్‌కు వినతిపత్రం ఆందించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు బి.లక్ష్మి, ఎం.వెంకట్, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు డి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.










