ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
రాష్ట్రంలోని ఎస్‌సి కార్పొరేషన్లలో పేరుకుపోయిన రుణ వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ ఇస్తూ 'సర్కారు వారి పాట' సినిమాలో పద్ధతిని అనుసరించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బలవంతంగా వెనక్కి లాక్కొనడమే దీని సారాంశంగా ఉంది. ప్రతి వారం సమీక్షలు, నెలవారీ లక్ష్యాలను నిర్ణయించుకుని రాష్ట్రంలో పేరుకుపోయిన రుణాల సొమ్మును రాబట్టాలని, ఈ క్రమంలో లబ్ధిదారులపై ఒత్తిడి చేసైనా రుణాలను వెనక్కి లాగాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో అంతంత మాత్రం సిబ్బందిగల విశాఖపట్నం జిల్లా ఎస్‌సి కార్పొరేషన్ వారికి ఏం చేయాలో పాలుపోని స్థితి తాజాగా నెలకొంది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అత్యధిక రుణాలన్నీ వాహనాలకే కావడం విశేషం. గత ప్రభుత్వం ఈ రుణాలను ఇండికా కార్లు 60కి, ఎతియోస్ కార్లు 40కి మంజూరు చేసింది. రవాణా రంగ రుణాలుగా చంద్రబాబు సర్కారు 2014లో దరఖాస్తులు స్వీకరించి 2016 నుంచి రుణాలను ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా అందజేసింది. ఇలా ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసిలో రూ.7.63 కోట్ల విలువైన 311 యూనిట్లు మంజూరు చేసింది. 2019 నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణాలను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. కానీ రుణ వసూళ్లకు మాత్రం విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలోగల డిఆర్‌డిఎ సంక్షేమ భవన్‌లో ఎస్‌సి కార్పొరేషన్ కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో 2022 ఆగస్టు వరకూ రూ.3.94 కోట్లు వసూలు కాగా ఇంకా రూ.3.68 కోట్లు రుణాలు రాలేదు. జాతీయ సఫాయి కర్మచారీ పథకం (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి) పథకం కింద మరో 84 యూనిట్లు 86 లక్షల రుణాలు 2014-2019 మధ్య కాలంలో ఇవ్వగా వీటిలో రూ.39 లక్షలు వసూలయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వాహనాల కోసమే 2016-2019 మధ్య కాలంలో రూ.5.69 కోట్లును ఎస్‌సి కార్పొరేషన్ అందజేసింది. మిగతా పథకాల కోసం రూ.1.94 కోట్లు మంజూరు చేసింది.
నిధులు, సిబ్బంది లేక బక్కచిక్కిన ఎస్‌సి కార్పొరేషన్
జిల్లాలోని ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి) పోస్టు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంది. ఎస్‌సి కార్పొరేషన్ ఎఇఒ పోస్టులు రెండు ఉండాల్సి ఉండగా ఒక్కటే ఉంది. మహిళా ఉద్యోగి ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్‌లు 5, జూనియర్ అసిస్టెంట్‌లు 2 ఖాళీగా ఉన్నాయి. ఒక కంప్యూటర్ ఆపరేటర్ మహిళ ఉన్నారు. ఒక్క డ్రైవర్ ఉన్నాడు. అతడొక్కడే పురుష ఉద్యోగి. మొత్తంగా చూస్తే జిల్లా ఎస్‌సి కార్పొరేషన్‌లో 14 పోస్టులకు నలుగురే ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఉద్యోగినులు. వీరి ద్వారా ఫోన్‌లలో మాత్రమే కార్పొరేషన్ లబ్ధిదారులతో రుణ వసూళ్లకు సంబంధించి మాట్లాడి వసూళ్లుకు పూనుకుంటున్నారు. డ్రైవర్‌ను క్షేత్రస్థాయిలోకి లబ్ధిదారుల వద్దకు పంపుతున్నట్లు ప్రస్తుత ఎస్‌సి కార్పొరేషన్ ఇన్‌ఛార్జి ఇడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డి.రమణమూర్తి 'ప్రజాశక్తి'కి తెలిపారు. రుణ వసూళ్లకు సమర్థ ప్రణాళికలు చేపడుతున్నా సిబ్బంది కొరత, లబ్ధిదారుల నుంచి సహకారం తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. కొత్తగా రుణాలివ్వకుండా పాత ప్రభుత్వం ఇచ్చిన రుణాలను వసూలు చేయడం సరైంది కాదని లబ్ధిదారుల నుంచి సమాధానాలు వస్తున్నాయి. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా లబ్ధిదారులు కారు కోసం తాము తీసుకున్న రుణం నెలవారీ కడుతున్న సందర్భంలో వారిపై రుణాలు చెల్లించని కొంతమంది 'మీరు చెల్లించడం వల్ల మాపై ఒత్తిడి వస్తోంది' అంటూ ఆపేసే ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం తాము అధికారంలోకి వస్తే రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించడంతో ఎవ్వరూ రుణాలు చెల్లించడం లేదు. ఇదిలా ఉండగా లబ్ధిదారులపై కార్పొరేషన్ మాత్రం తీవ్రంగా ఒత్తిడి పెట్టడం విశేషం.










