ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎస్‌సి, ఎస్‌టి ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందన కార్యక్రమానికి వచ్చిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ స్పందన హాల్లో ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక స్పందనలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డిఆర్‌ఒ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఒ వెంకట రమణా రెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులకు పంపించి నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించవలసిందిగా ఆదేశాలిచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ సేవలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెన్షన్ తదితర అంశాలపై మొత్తం 31 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి నెలా మూడో శుక్రవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక స్పందనలో అందిన ప్రతి అర్జీనీ అధికారులు క్షుణ్నంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్స్, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు వంటి ఇతర అంశాలపై 22 అర్జీల అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ ఎఒ జిఎస్‌ఎస్.శ్రీనివాసు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.










