
ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్
చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
- వ్యకాసం, కెవిపిఎస్ నేతలు డిమాండ్
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.రామదాసు, ఎమ్మార్పీఎస్ నాయకులు దుర్గయ్య, ఎస్సీ, ఎస్టీ ఆర్టీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శీలయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయంకోసం ఈ నెల 29న విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వ్యకాసం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దళితుల రక్షణ యాత్ర జీపు జాతా మంగళవారం ఆత్మకూరు పట్టణానికి చేరుకుంది. ముందుగా పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. అనంతరం నరసింహ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగారిచే 41 సిర్‌పిసిని రద్దు చేయాలన్నారు. దళిత, గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలన్నారు. కోనేటి రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలన్నారు. అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని, మిగులు భూములు పేదలకు పంచాలన్నారు. డప్పు, చర్మ కళాకారులకు పింఛన్ రూ.5 వేలకు పెంచాలన్నారు. స్మశానంలో పని చేస్తున్న కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సంజీవరాయుడు, ప్రజా సంఘాల నాయకులు పాతకోట భాస్కర్, నక్క సంపత్, ఎన్ స్వాములు, బాలయ్య, శివమ్మ, మాభాష, వీరన్న, రామ నాయక్, రణధీర్, మల్లె ఎలీషా, పాతకోట రమేష్, శివ నాయక్, శ్రీను నాయక్, గణపతి, వడ్డరామాపురం వెంకటేశ్వర్లు, కేశవులు, బుజ్జి, నాగేంద్రబాబు, ప్రజానాట్యమండలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పాములపాడు : దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు అత్యధికంగా పెరిగాయని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షురాలు రంగమ్మ, కార్యదర్శి రామదాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్‌లు అన్నారు. దళిత రక్షణ యాత్ర జీపు జాతా పాములపాడుకు చేరుకుంది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందని, లక్షలాది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. నేటికీ గ్రామాలలో దళితులు చనిపోతే పూడ్చేందుకు స్మశానం కూడా లేదన్నారు. ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నను విజయవంతం చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, వ్యకాసం జిల్లా నాయకులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.