Jul 20,2023 00:03

మాట్లాడుతున్న విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసుల్లో సత్వర పరిష్కారం కోసం విచారణను వేగవంతం చేయాలని పోలీస్‌, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ నూతన సభ్యులతో బుధవారం ఈ సంవత్సరం మొదటి, ద్వితీయ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం ద్వారా ప్రజల్లో కేసుల పరిష్కారం పట్ల నమ్మకం ఏర్పరచాలని సూచించారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను, కారణాలను పోలీస్‌ అధికారులతో చర్చించి, సుదీర్ఘంగా పరిష్కారానికి నోచుకోని కేసులపై వెంటనే దృష్టిపెట్టాలన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ యాక్ట్‌ (పీఓఏ), ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ (పీసీఆర్‌) చట్టాల కింద నమోదైన ఎస్‌సి, ఎస్‌టి పెండింగ్‌ కేసులను సకాలంలో పరిష్కరించాలన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు చెల్లించే పరిహారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 92 కేసులలో 88 మంది బాధితులకు రూ.1.15 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 95 కేసులు అండర్‌ ఇన్వెస్టిగేషన్లో ఉండగా, 679 కేసులు పెండింగ్‌ ట్రయల్‌ దశలో ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా కుల ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌ ఉన్నాయని, వాటి జారీలో ఆర్‌డిఒలు, తహశీల్దార్లు అలసత్వాన్ని ప్రదర్శించవద్దని చెప్పారు. జిల్లాలో ఏసీపీల పరిధిలో ఎస్‌సి, ఎస్‌టి కేసులు 2013 నుంచి 2023 వరకు 97 కేసులు పోలీసు శాఖ ద్వారా విచారణలో ఉన్నాయని, ఈ కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి కేసుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉందని, ఈ సెల్‌ ద్వారా కేసులు సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో డివిజనల్‌ స్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు ప్రతినెలా ఏర్పాటు చేయాలని, పెండింగ్‌ కేసులకు సంబంధించి బాధితులకు తమ కేసుల వివరాలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. కేసులు పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో చర్చించాలని ఆదేశించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ సివిల్‌ రైట్స్‌ డే నిర్వహణ సక్రమంగా లేదని సరిగా నిర్వహించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కె.రామారావు, ఆర్‌డిఒలు హుస్సేన్‌ సాహెబ్‌, భాస్కర్‌ రెడ్డి, డిసిపి నాగన్న , ఎసిపిలు, పబ్లిక్‌ ప్రాసక్యూటర్‌ బివిఅర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.