Jul 15,2023 21:52

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులను పరిష్కరించండి
- జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఎస్‌,సి ఎస్టీల అట్రాసిటీ కేసులు దీర్ఘకాలం పెండింగ్లో ఉండకుండా వేగవంత పరిష్కారానికి జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. విచారణలో సాక్షులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు ఆళ్లగడ్డలో 11, ఆత్మకూరులో 7, డోన్‌లో 6, నంద్యాలలో 2, ఎస్సీ, ఎస్టీ సెల్‌కు సంబంధించిన 4 కేసుల వివరాలు అడిగి తెలుసుకొని 20 రోజుల్లో క్లియర్‌ చేయాలని సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్‌ నుండి డిసెంబర్‌ వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 69 కేసులకు సంబంధించిన 102 మంది బాధితులకు రూ. 1.6 కోట్లు, ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 21 కేసులకు సంబంధించిన 62 మంది బాధితులకు రూ.1.36 కోట్లు, ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు 45 కేసులకు సంబంధించిన 81 మంది బాధితులకు రూ.93.26 లక్షల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు జీవన్‌ రాజు, రమేష్‌, చిటికల సలోమి, దిలీప్‌ రాజు, అశోక్‌ నాయక్‌, మమత, శ్రీనివాసులు సూచించిన అంశాలన్నిటిపై నివేదికలు తెప్పించుకొని సత్వరమే పరిష్కరించి నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గడివేముల, కొలిమిగుండ్ల, నంద్యాల, సిరివెళ్ల, సంజామల మండలాలలో పౌర హక్కుల దినోత్సవం జరగలేదని, ప్రతి నెలా 30వ తేదీ నిర్వహించేందుకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ జి.వెంకట రాముడు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు చిటికెల సలోమి, జీవన్‌ రాజు, రమేష్‌, దిలీప్‌ రాజు, అశోక్‌ నాయక్‌, మమత, శ్రీనివాసులు, కమిటీ అధికారిక సభ్యులు, నంద్యాల, డోన్‌, ఆత్మకూరు డివిజన్ల డిఎస్పీలు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.