Jul 17,2023 23:57

ఫిర్యాదు చేస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి-పాడేరు: 14,15వ ఆర్థిక సంఘం నిధులు కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లోని గిరిజన సర్పంచులు డిమాండ్‌ చేశారు. 6కోట్ల అరవై ఒక లక్షల నలభై వేల ఏడు వందల నాలుగు రూపాయలు పంచాయతీ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా కు సర్పంచులు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దంగా పంచాయతీలకు ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు కావస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ చేస్తే సర్పంచ్‌ అనుమతి, పంచాయతీ తీర్మానం లేకుండా పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం తీసుకోవడం రాజ్యంగ పరంగా, చట్ట పరంగా విరుద్దమని తెలిపారు. పంచాయతీ ఖాతాలో జమ చేయకపోవడంతో పంచాయతీల అభివృద్ధి కుంటిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ ఛాంబర్‌ ఉపాధ్యక్షులు బొర్రా నాగరాజు, సర్పంచ్‌లు బాకూరు వెంకటరమణ రాజు, పాంగి పాండురంగ స్వామి, కంబిడి సరోజినీ, తామర్ల సత్యనారాయణ,శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు, హుకుంపేట మాజీ జడ్పీటీసీ సాగర సుబ్బారావు, టీడీపీ సీనియర్‌ నాయకులు కంబిడి జ్ఞాన ప్రకాష్‌, త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.